భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తీసుకొచ్చిన ‘భూ భారతి | Bhu Barathi Portal Guidelines in Telugu 2025

Bhu Barathi Portal Guidelines in Telugu

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి శుభసందర్భంగా ప్రభుత్వం నూతనంగా తెచ్చిన భూ భారతి చట్టం, భూ భారతి పోర్టల్‌ను ముఖ్యమంత్రి గారు శిల్ప కళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ ప్రజలకు అంకితం చేశారు.

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తీసుకొచ్చిన ‘భూ భారతి’ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రెవెన్యూ యంత్రాంగాన్ని కోరారు. తెలంగాణలో వివాద రహిత భూ విధానాలు ఉండాలన్నదే ప్రభుత్వ ప్రయత్నమని స్పష్టం చేశారు. ఆధార్ తరహాలో భవిష్యత్‌లో భూమికి సంబంధించి సర్వే చేసి కొలతలు, హద్దుల వంటి సమగ్రమైన వివరాలతో ‘భూధార్’ తీసుకొస్తామని ప్రకటించారు.

పైలట్ ప్రాజెక్టుగా తొలి విడతా భూ భారతిని నాలుగు మండలాల్లో చేపడుతాం. ప్రజా పోరాటాల నుంచి పుట్టుకొచ్చిన రెవెన్యూ చట్టాలు, ప్రజల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం.ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత రెవెన్యూ అధికారులపైనే ఉంది. రెవెన్యూ అధికారులను ప్రజలకు చేరువ చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. గత పాలకుల తరహాలో రెవెన్యూ సిబ్బందిని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ఆలోచనకు ప్రజా ప్రభుత్వం వ్యతిరేకం. అవినీతికి పాల్పడే వ్యక్తులపైన కఠినంగా వ్యవహరిస్తాం. కానీ వ్యవస్థపై కాదు.ఎంతో మంది అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని, ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి భూములకు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతో భూ భారతి చట్టం తెచ్చాం.

ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి విజ్ఞప్తులను తీసుకుని వాటిని పరిష్కరించాలి. ప్రభుత్వలక్ష్యం నెరవేరాలంటే రెవెన్యూ సిబ్బంది మాత్రమే ఆ పనిని చేయగలరు. రెవెన్యూ సిబ్బంది రైతాంగాన్ని రెండు కళ్ల లాంటి వారు. రెవెన్యూ శాఖపైన కొందరు సృష్టించిన అపోహలను తొలగించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.గ్రామాలు, మండలాల్లో ప్రజా దర్బార్లు, రెవెన్యూ సదస్సులు నిర్వహించడం ద్వారా అవగాహన కల్పించాలి. అందరి సహకారంతో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయండి. ఈ చట్టాన్ని గ్రామాలకు తీసుకెళ్లండి..” అని ముఖ్యమంత్రి కోరారు.

Leave a Comment