తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు: కేంద్ర వివక్షపై మంత్రుల ధ్వజం | telangana-paddy-procurement-record-uttam-tummala-news 2026

telangana-paddy-procurement-record-uttam-tummala-news

ప్రస్తుత యాసంగి సీజన్‌లో దేశంలోనే అత్యధికంగా ధాన్యాన్ని సేకరించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌ తదితరులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.16,479 కోట్ల విలువైన 60 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని వెల్లడించారు.

ఇతర రాష్ట్రాలతో పోలిక (టన్నుల్లో సేకరణ):

తెలంగాణ: 60 లక్షలు
ఆంధ్రప్రదేశ్: 24 లక్షలు
తమిళనాడు: 12…
మహారాష్ట్ర: 3 లక్షలు
కేరళ:2 లక్షలు

కేంద్ర కోటాలపై మంత్రి ఉత్తమ్ విమర్శలు

రాష్ట్రంలో వరి సాగు మరియు దిగుబడి ఏటా పెరుగుతున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం భారత ఆహార సంస్థ (FCI) ద్వారా సేకరించే కోటాను క్రమంగా తగ్గిస్తూ తెలంగాణపై పక్షపాతం చూపిస్తోందని మంత్రి ఆరోపించారు.

లక్ష్యానికి మించి కొనుగోళ్లు: ఈ సీజన్‌లో 75 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేయగా, కేంద్రం కేవలం 52 లక్షల టన్నులకే అనుమతినిచ్చింది. అయినప్పటికీ, రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో 24 లక్షల టన్నులను సేకరిస్తోంది.
రైతులకు చెల్లింపులు: మే 28వ తేదీ నాటికి రైతుల ఖాతాల్లో రూ.11,050 కోట్లు జమ చేశామని, చివరి గింజ కొనేవరకు కొనుగోలు కేంద్రాలు తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు.
రవాణా, మౌలిక వసతులు: ధాన్యం తరలింపు కోసం 13 వేల వాహనాలు, 2 లక్షల మంది సిబ్బంది పనిచేస్తున్నారని, అవసరమైతే ఇసుక, సిమెంట్ లారీలను కూడా వినియోగించుకోవాలని కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. అలాగే, వర్షానికి తడిసిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధర (MSP)కే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వంతో పోలిక: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన టార్గెట్‌లో కేవలం 50-60 శాతం మాత్రమే కొనుగోలు చేసేదని, తాము రైతులకు ఏడాదికి రూ.49 వేల కోట్ల మద్దతు ధర చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.

కేంద్ర వైఖరిపై మంత్రి తుమ్మల ఆగ్రహం

  • వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో పండిన పంట మొత్తాన్ని కొనుగోలు చేస్తున్న కేంద్రం, తెలంగాణ రైతుల పట్ల మాత్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు.
  • మొక్కజొన్నకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించి కేంద్రం చేతులెత్తేయడం వల్ల రైతులు రూ.1,400 లకే అమ్ముకోవాల్సి వస్తోంది. కేవలం ధరలు ప్రకటించి వదిలేస్తే మిగిలిన పంటను ఎవరు కొనాలి?” అని ఆయన ప్రశ్నించారు.
  • రాష్ట్రానికి అవసరమైన 11 లక్షల టన్నుల యూరియాను సరఫరా చేయడంలో కేంద్రం తీవ్ర ఆలస్యం చేస్తోందని, వానాకాలం సీజన్‌లో ఎరువుల కొరత ఏర్పడితే కేంద్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

విపక్షాల తీరుపై మంత్రి పొన్నం వ్యాఖ్యలు

మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. ఇంధన ధరల పెంపు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే బీజేపీ ‘రైతుగోస యాత్ర’ చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రైతుల నుంచి మంచి స్పందన వస్తుండటంతో, తట్టుకోలేక బీఆర్‌ఎస్ నేతలు ఆందోళనలు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

Leave a Comment