మహానాడు వేదికగా నారా లోకేష్ చారిత్రాత్మక ప్రకటన: 2029 ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు| nara-lokesh-mahanadu-announcement-women-reservation-2029-elections

nara-lokesh-mahanadu-announcement-women-reservation-2029-elections

అమరావతి:తెలుగుదేశం పార్టీ (TDP) మహానాడు వేదికగా రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టించే భారీ నిర్ణయాన్ని మంత్రి, యువనేత నారా లోకేష్ ప్రకటించారు. “మహిళా సాధికారత అనేది కేవలం ఒక నినాదం కాదు.. అది మా సంకల్పం, మా కమిట్‌మెంట్” అని స్పష్టం చేస్తూ, రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున మహిళలకు ఏకంగా 33 శాతం సీట్లు కేటాయించనున్నట్లు ఆయన సంచలన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ చారిత్రాత్మక ప్రకటనతో మహానాడు సభ ప్రాంగణం ఒక్కసారిగా మారుమోగింది.

పార్లమెంట్ బిల్లుతో సంబంధం లేకుండా అమలు!

ఉదయం తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో ‘బిగ్ అనౌన్స్‌మెంట్‌’ అంటూ ఆసక్తి రేకెత్తించిన లోకేష్, అందుకు తగ్గట్టుగానే తన ప్రసంగంలో మహిళా రిజర్వేషన్లపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇచ్చారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ల బిల్లును తెచ్చేందుకు ఎన్డీయే (NDA) ప్రభుత్వం చారిత్రాత్మక అడుగు వేసినప్పటికీ, ప్రతిపక్షాలు దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించాయని ఆయన విమర్శించారు.

“మన స్త్రీశక్తికి మరింత బలం చేకూర్చేందుకు ప్రయత్నిస్తే ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించాయి. ఇప్పుడు నేను ఒకటే ప్రతిపాదన చేస్తున్నాను.. పార్లమెంట్‌లో బిల్లు పాస్ అయినా, అవ్వకపోయినా సరే, మహిళా రిజర్వేషన్లను అమలు చేసి తీరుతాం. వచ్చే ఎన్నికల్లో 33% సీట్లను మహిళలకే కేటాయిస్తాం” అని లోకేష్ స్పష్టం చేశారు.

ఎన్నికల సమయంలో మహిళా ఓటర్ల చుట్టూ తిరిగే పార్టీలు, గెలిచాక వారిని మర్చిపోతాయని, కానీ టీడీపీ భవిష్యత్తును మహిళలతో కలిసి భుజం భుజం కలిపి నడిపిస్తామని ఆయన నొక్కి చెప్పారు. భారత రాజకీయాల తదుపరి శకం మహిళా నాయకత్వానిదేనని తాను గట్టిగా నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.

‘సీబీఎన్’ (CBN) ఒక అంతర్జాతీయ బ్రాండ్!

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ‘సీబీఎన్’ (CBN) అనే మూడు అక్షరాల బ్రాండ్‌కు ప్రత్యేక గౌరవం దక్కుతుందని లోకేష్ కొనియాడారు. “ఒకే రాష్ట్రం – ఒకే రాజధాని – అభివృద్ధి వికేంద్రీకరణ” అనేది తమ ప్రభుత్వ స్పష్టమైన విధానమన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా వస్తున్న మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే వస్తున్నాయని.. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్, ఫైటర్ జెట్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఏపీకి క్యూ కడుతున్నాయని ఆయన వివరించారు.

డీఎస్సీ (DSC) వివాదంపై వైసీపీకి కౌంటర్

ఉపాధ్యాయ నియామకాల (DSC) విషయంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను మంత్రి లోకేష్ తీవ్రంగా ఖండించారు. మొదట డీఎస్సీ ప్రక్రియను పూర్తిగా అడ్డుకోవడానికి వైసీపీ కుట్రలు చేసిందని, అది సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు నిరుద్యోగులను తప్పుదోవ పట్టించేలా కొత్త డ్రామాలకు తెరలేపిందని మండిపడ్డారు. వైసీపీ చేస్తున్న ఇటువంటి రాజకీయ కుట్రల పట్ల నిరుద్యోగులు, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Comment