maa-inti-bangaram-movie-review-samantha-box-office
స్టార్ హీరోయిన్ సమంత తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా పిక్చర్స్’ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘మా ఇంటి బంగారం’. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, భారీ అంచనాల మధ్య నేడు (జూన్ 19న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లాంగ్ గ్యాప్ తర్వాత సమంత నటిస్తున్న సినిమా కావడంతో ప్రమోషన్స్‌తోనే మంచి హైప్ క్రియేట్ చేశారు. మరి ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..
కథేంటంటే?
స్వర్ణ (సమంత), అనిరుధ్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అయితే, అనిరుధ్ సాంప్రదాయ కుటుంబానికి వీరి వివాహం ఇష్టం లేకపోవడంతో కొంతకాలం దూరంగా ఉంటారు. అనిరుధ్ చెల్లెలి వివాహం నిశ్చయం కావడంతో, ఈ జంట మళ్లీ సొంత ఇంటికి తిరిగి వస్తుంది. అత్తగారి కుటుంబ సభ్యుల మనసులు గెలుచుకోవడానికి స్వర్ణ గట్టిగానే ప్రయత్నిస్తుంటుంది.
సరిగ్గా అదే సమయంలో, జైల్లో ఉన్న కరుణ (గుల్షన్ దేవయ్య) అనే ప్రమాదకరమైన నేరస్థుడు స్వర్ణ గురించి తెలుసుకుని, ఆమెపై పగ తీర్చుకోవడానికి జైలు నుండి తప్పించుకుంటాడు. అసలు స్వర్ణకు, కరుణకు ఉన్న పాత శత్రుత్వం ఏంటి? స్వర్ణ గతం వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఆమె అసలు పేరు ఝాన్సీనా? కరుణ నుండి తన అత్తగారి కుటుంబాన్ని స్వర్ణ ఎలా కాపాడుకుంది? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే? (విశ్లేషణ)
కథాంశం పరంగా చూస్తే.. ఇది పాత పగలు, కుటుంబ సెంటిమెంట్ల చుట్టూ తిరిగే ఒక రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామా. ఒక ఇల్లు, అక్కడ జరిగే ఎమోషనల్ డ్రామా, రొటీన్ విలనిజం, కాస్త నెమ్మదిగా సాగే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు ప్రధాన బలహీనతలుగా చెప్పుకోవచ్చు.
కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినప్పటికీ, సమంత తన అద్భుతమైన పర్ఫార్మెన్స్తో సినిమాను వన్-వుమెన్ షోలా ముందుకు నడిపించారు. కొత్త కోడలిగా ఎమోషనల్ సీన్స్‌లోనూ, అలాగే ఊరమాస్ యాక్షన్ సీక్వెన్స్‌లలోనూ సమంత నటన అమోఘం. స్క్రీన్‌ప్లే అక్కడక్కడా సాగదీసినట్లు అనిపించినా.. మధ్యమధ్యలో వచ్చే కామెడీ పంచ్‌లు ప్రేక్షకులకు మంచి ఊరటనిస్తాయి. దర్శకురాలు నందిని రెడ్డి ‘ఓ బేబీ’ స్థాయి మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయినా, కుటుంబంతో కలిసి చూసేలా సినిమాను మలిచారు.
నటీనటులు – సాంకేతిక విభాగం
సమంత తర్వాత ఈ చిత్రంలో విలన్‌గా నటించిన గుల్షన్ దేవయ్య తన క్రూరమైన నటనతో మెప్పించారు. శ్రీముఖి తన పాత్ర పరిధి మేరకు ఆకట్టుకోగా, మిగిలిన నటీనటులు ఓకే అనిపించారు.
సాంకేతిక పరంగా చూస్తే.. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్‌ని తీసుకొచ్చింది. విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే సెకండ్ హాఫ్‌లో ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. ట్రాలాలా పిక్చర్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా చాలా క్వాలిటీగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
-
సమంత వన్-వుమెన్ షో (యాక్షన్ & ఎమోషన్స్)
-
గుల్షన్ దేవయ్య విలనిజం
-
సంతోష్ నారాయణన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
-
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
-
రొటీన్ కథ, కథనం
-
సెకండ్ హాఫ్‌లో సాగదీత
-
బలహీనమైన ఫ్లాష్‌బ్యాక్
చివరిగా: రొటీన్ స్టోరీ లైన్ అయినప్పటికీ.. సమంత యాక్షన్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ కోసం ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని ఒకసారి థియేటర్లలో చూడొచ్చు.
- Youtube Channel: Click Here
- Horror Stories: Click Here
- Entertainment: Click Here
- Join Whats App: Join










