భారత్‌కు ఊరట భారీ ముడి చమురు నిల్వలు ఆయిల్ ఫీల్డ్‌ను అధికారికంగా అభివృద్ధి | india-oil-reserves-ashok-nagar-west-bengal-petrol-diesel-crisis 2026

india-oil-reserves-ashok-nagar-west-bengal-petrol-diesel-crisis

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్-అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఇప్పటికే యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో చమురు, సహజ వాయువు సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో అనేక దేశాలు ఇంధన కొరత సమస్యను ఎదుర్కొంటున్నాయి.

ఈ పరిస్థితుల ప్రభావం భారత్‌పైనా కనిపిస్తోంది. చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో గత వారం రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం నాలుగు సార్లు సవరించింది. అదేవిధంగా గ్యాస్ బుకింగ్, డెలివరీ వ్యవస్థల్లో కూడా కొన్ని మార్పులు తీసుకువచ్చింది.

ఇలాంటి సంక్షోభ సమయంలో భారత్‌కు ఊరట కలిగించే మరో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే రాజస్థాన్‌లోని జైసల్మేర్ బేసిన్‌లో భారీ సహజ వాయువు నిల్వలు గుర్తించిన విషయం తెలిసిందే. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని అశోక్ నగర్ ఆయిల్ ఫీల్డ్‌లో కూడా భారీ ముడి చమురు నిల్వలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ చమురు క్షేత్రం కోల్‌కతాకు సుమారు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని అశోక్ నగర్ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో పెట్రోలియం, సహజ వాయువు నిల్వలు ఉన్నట్లు కొన్ని సంవత్సరాల క్రితమే గుర్తించారు. అనంతరం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) 2018లో ఈ ఆయిల్ ఫీల్డ్‌ను అధికారికంగా అభివృద్ధి చేసింది.

నివేదికల ప్రకారం, తూర్పు భారతదేశంలో చమురు, గ్యాస్ ఉత్పత్తికి అనువైన తొలి ప్రధాన క్షేత్రంగా అశోక్ నగర్ గుర్తింపు పొందింది. ఇక్కడ సుమారు 24 కోట్ల బ్యారెల్స్ ముడి చమురు నిల్వలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా చమురు దిగుమతులపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌కు వ్యూహాత్మకంగా కూడా ప్రాధాన్యత పెరిగింది.

ఇటీవల బీజేపీ ఎంపీ సమిక్ భట్టాచార్య, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి అశోక్ నగర్ ఆయిల్ ఫీల్డ్ అభివృద్ధిని వేగవంతం చేయాలని కోరినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే దేశీయ చమురు ఉత్పత్తి పెరగడమే కాకుండా విదేశీ దిగుమతులపై ఆధారపడే పరిస్థితి కొంతవరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

అలాగే భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ సరఫరా సమస్యలను తగ్గించడంలో కూడా ఈ చమురు క్షేత్రం కీలక పాత్ర పోషించే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.

Leave a Comment