Agreement with the legendary company Unilever
తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic Forum) లో మరో దిగ్గజ కంపెనీ యూనిలీవర్ (Unilever) తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. కామారెడ్డి జిల్లాలో ఆయిల్ పామ్ ఉత్పత్తి కేంద్రం, మరోచోట బాటిల్ క్యాప్ లను తయారు చేసే యూనిట్ ను ఏర్పాటు చేయనుంది.
ఎఫ్ఎంసీజీ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన యునిలీవర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ హెయిన్ షూమాకర్ ( Hein Schumacher) గారు, చీఫ్ సప్లయి చైన్ ఆఫీసర్ విల్లెం ఉయిజెన్ (Willem Uijen) గారితో ముఖ్యమంత్రి గారు, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు జరిపిన చర్చల అనంతరం ఈ మేరకు ఒప్పందం కుదిరింది. దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ వ్యూహాత్మక కేంద్రంగా ఉంటుందని, విస్తృత మార్కెట్ కు మిగతా రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు వివరించారు. పెట్టుబడులకు, పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న సానుకూల పరిస్థితులను ముఖ్యమంత్రి గారు వారితో పంచుకున్నారు.దేశంలో యూనిలీవర్ కు పలుచోట్ల కేంద్రాలు ఉన్నప్పటికీ తెలంగాణలో విస్తరించలేదని, వినియోగ వస్తువులకు రాష్ట్రంలో భారీ మార్కెట్ ఉందని, ఇక్కడి సులభతర వ్యాపార విధానాలు తయారీ సంస్థలకు అదనపు బలంగా ఉంటాయని ముఖ్యమంత్రి గారు చెప్పారు.
యూనిలీవర్ సీఈవో షూ మాకర్ గారు మాట్లాడుతూ, తెలంగాణలో పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీంతో పాటు బాటిల్ క్యాప్‌లను ఉత్పత్తి చేయడానికి కొత్త తయారీ యూనిట్‌ను నెలకొల్పడానికి వారు అంగీకరించారు.ప్రస్తుతం యూనిలీవర్ సంస్థ తమ ఉత్పత్తుల బాటిల్ క్యాప్‌లను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనే బాటిల్ క్యాప్ యూనిట్‌ను నెలకొల్పడం ద్వారా వాటి కొరతను అధిగమించవచ్చు. రాష్ట్రంలో యూనిలీవర్ విస్తరణకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తామని, పామాయిల్ యూనిట్ ఏర్పాటుకు కామారెడ్డి జిల్లాలో అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు.