మీరు ఎప్పుడైనా గడ్డి జ్యూస్ తాగారా ! ఇక్కడ చాల ఫేమస్ మీరు ఓ లుక్కేయండి | wheatgrass-juice-health-benefits-and-self-employment-success-story-adilabad 2026

wheatgrass-juice-health-benefits-and-self-employment-success-story-adilabad

ఆదిలాబాద్: నేటి ఉరుకులు పరుగుల జీవితంలో అనారోగ్య సమస్యలు మనిషిని చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలు తిరిగి ప్రకృతి సిద్ధమైన ఆహారపు అలవాట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. జిమ్‌లు, వ్యాయామాలతో పాటు పోషకాలు పుష్కలంగా ఉండే సహజ రసాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సరిగ్గా ఇదే అంశాన్ని ఉపాధిగా మార్చుకోవడమే కాకుండా, పది మందికి ఆరోగ్యాన్ని పంచుతున్నాడు నిర్మల్ జిల్లాకు చెందిన రవికిరణ్.

హైదరాబాద్ అనుభవంతో ఆదిలాబాద్‌లో అడుగు..

నిర్మల్ జిల్లా కడెం గ్రామానికి చెందిన రవికిరణ్‌కు సొంత ఊరిలో వ్యవసాయ భూమి ఉన్నా, ఏదైనా కొత్తగా చేయాలనే తపన ఉండేది. గతంలో హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద గోధుమ గడ్డి రసం విక్రయ కేంద్రంలో పనిచేసిన అనుభవంతో, దానిలోని అద్భుతమైన పోషక విలువల గురించి తెలుసుకున్నాడు. ఆ నమ్మకంతోనే రెండేళ్ల క్రితం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చౌరస్తా సమీపంలో ఒక చిన్న విక్రయ కేంద్రాన్ని ప్రారంభించాడు.

ఉదయం 5 నుండి 11 వరకు సందడి..

ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే రవికిరణ్ తన కేంద్రాన్ని ప్రారంభిస్తాడు. నడకకు వచ్చే వారు, వ్యాయామం చేసే వారు క్రమం తప్పకుండా ఇక్కడ ఆగి గోధుమ గడ్డి రసాన్ని సేవిస్తారు. గోధుమ గడ్డితో పాటు వివిధ రకాల పండ్లు, కూరగాయల రసాలను కూడా ఆయన ఇక్కడ అందిస్తుంటాడు. కేవలం అక్కడే తాగడమే కాకుండా, చాలా మంది తమ కుటుంబ సభ్యుల కోసం పార్శిళ్లను కూడా తీసుకెళ్తుండటం విశేషం.

గోధుమ గడ్డి రసంతో కలిగే ప్రయోజనాలు:

రవికిరణ్ కథనం ప్రకారం.. గోధుమ గడ్డి రసం ఒక “సూపర్ ఫుడ్” లాంటిది. ఇందులో ఉండే క్లోరోఫిల్, విటమిన్లు, మరియు ఖనిజాలు రక్తశుద్ధికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో తోడ్పడతాయి. మొదట్లో తక్కువ మందికి తెలిసినా, ఇప్పుడు సామాన్యులు కూడా దీని ప్రాముఖ్యతను గుర్తించి క్రమం తప్పకుండా తాగుతున్నారని ఆయన సంతోషంగా చెబుతున్నారు.

విస్తరిస్తున్న కేంద్రాలు..

ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి రవికిరణ్ తన వ్యాపారాన్ని మరింత విస్తరించాడు. మొదట ఒకే కేంద్రంతో మొదలుపెట్టి, ఇప్పుడు మరిన్ని చోట్ల వీటిని ఏర్పాటు చేసి పలువురికి ఉపాధిని కూడా కల్పిస్తున్నాడు. కల్తీ లేని సహజ సిద్ధమైన రసాలను అందిస్తూ అటు ఆదాయాన్ని, ఇటు ప్రజల మన్ననలను పొందుతున్నాడు.



Leave a Comment