Telangana government starting new projects
ఆర్థిక వృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగ కల్పన, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనతో పాటే సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని సమతుల్యం చేసుకుంటూ సమగ్రమైన సమ్మిళితమైన అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు.
“తెలంగాణ రైజింగ్” అనే ఆలోచనలో ఈ దార్శనికత ఇమిడి ఉందని అన్నారు.నానక్‌రామ్‌గూడలో సొనాటా సాఫ్ట్‌వేర్ నూతన ఫెసిలిటీ సెంటర్ ను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, హైదరాబాద్‌ను ప్రపంచంలోని అద్భుత నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన ప్రణాళికలను ఈ వేదికగా వివరించారు. అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దడంలో, తెలంగాణ అభివృద్ధిని ప్రపంచం ముందు చాటడానికి ప్రతి ఒక్కరి సహకారం కావాలని, హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాలని కోరారు.
“హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (GCCs) హబ్ గా మారింది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, లైఫ్ సైన్సెస్, AI -రెడీ డేటా సెంటర్లలో ప్రముఖంగా నిలుస్తోంది. మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో వంటి గ్లోబల్ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో కార్యకలాపాలను విస్తరించాయి. హైదరాబాద్ అంతర్జాతీయ ప్రాముఖ్యత పెరిగింది. ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీలకు ఈ నగరం ఆతిథ్యమిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ ఈవెంట్లు హైదరాబాద్‌లో నిర్వహిస్తాం.తెలంగాణ అనేక కీలక రంగాల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వ నివేదికల ప్రకారం పోలీసింగ్ లో గానీ, చట్టాలను సరిగా అమలు చేయడంలోగానీ, ద్రవ్యోల్బణ నియంత్రణ, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ కల్పన, పన్నుల వసూళ్లలో తెలంగాణ అగ్రగామిగా ఉంది.
స్వయం సహాయ సంఘాల (SHGs) ద్వారా 66 లక్షల మందికి పైగా మహిళలకు సాధికారత కల్పిస్తూ, దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఫండింగ్ మరియు మెంటరింగ్ కార్యక్రమాన్ని తెలంగాణ అమలు చేస్తోంది.రాజీవ్ యువ వికాసం కార్యక్రమం ద్వారా వేలాది యువతకు వ్యాపార, స్వయం ఉపాధి రంగాల్లో మద్దతు అందిస్తున్నాం. అలాగే, సమానత్వం దిశగా కీలక అడుగు వేసిన తెలంగాణ, ట్రాన్స్‌జెండర్ వాలంటీర్లను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ బృందంలో చేర్చిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. తెలంగాణలో మౌలిక సదుపాయాలు, వివిధ ప్రాజెక్టుల కోసం డ్రైపోర్టును ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్‌లోని సముద్రతీర పోర్టుకు అనుసంధానం చేయనున్నాం.
భారతదేశంలోనే అత్యంత శాస్త్రీయంగా ప్రణాళికాబద్ధంగా హైదరాబాద్ సమీపంలో ‘ఫ్యూచర్ సిటీ’ నిర్మాణాన్ని చేపట్టాం. ఇందులో ప్రత్యేకంగా ‘AI సిటీ’ కూడా ఏర్పాటు చేస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపించడం వంటి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నాం.2023 డిసెంబర్ నుండి ఇప్పటివరకు తెలంగాణ ₹ 3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, దాదాపు 1 లక్షకు పైగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలను కల్పించాం. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశం, అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్ వంటి దేశాల్లో పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశాల ద్వారా పెట్టుబడుల ఆకర్షణలో భారతదేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ నిలిచింది. దావోస్ సమావేశంలోనే ₹1.78 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు లభించాయి.” అని వివరించారు.