Sarpanch Post Auctioned rs 73 lakhs to village
తెలంగాణాలో ఇప్పుడు స్థానిక ఎన్నికల జోరు నడుస్తూ ఉంది.ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు పాత్ర రోజురోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నల్గొండ జిల్లాలో జరిగిన సంఘటన సంచలనంగా మారింది. ఏకంగా సర్పంచ్ పదవిని వేలంపాట ద్వారా దక్కించుకున్న అభ్యర్థి ఆ మొత్తం గ్రామ అభివృద్ధికి కేటాయించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నల్గొండ జిల్లా, చండూరు మండలం పరిధిలోని బంగారిగడ్డ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే రూ.73 లక్షలకు దక్కిన సర్పంచ్ పదవి బంగారిగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి కోసం ముందుగా 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఆ గ్రామ పెద్దలు, ముఖ్యులు జోక్యం చేసుకుని, గ్రామాభివృద్ధి, ఆలయ నిర్మాణం కోసం ఈ పదవిని ఏకగ్రీవం చేయాలని నిర్ణయించారు. గ్రామస్తులు కనకదుర్గ ఆలయ నిర్మాణం, గ్రామాభివృద్ధి పనుల కోసం నిధులు సేకరించడానికి సర్పంచ్ పదవిని వేలం పాట పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ వేలంపాటలో అత్యధికంగా రూ.73 లక్షలు చెల్లించడానికి అంగీకరించిన అభ్యర్థి మహమ్మద్ సమీనా ఖాసీం సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు.
ఏకగ్రీవం కోసం ఒప్పందం
-వేలంలో మహమ్మద్ సమీనా ఖాసీంకు సర్పంచ్ పదవి దక్కడంతో నామినేషన్లు దాఖలు చేసిన మిగిలిన 10. మంది అభ్యర్థులు దీనికి అంగీకరిస్తూ ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. దీనితో వారు తమ నామినేషన్లను -ఉపసంహరించుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ నిర్ణయంతో బంగారిగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి ఏకగ్రీవం అయినట్లే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎన్నికల అధికారుల నుంచి వెలువడాల్సి ఉంది. ఎన్నికల ఖర్చు లేకుండానే రూ.73 లక్షలు గ్రామాభివృద్ధికి చేరడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.









