Sacorpion farming trades in turkey are selling
మనం మాములుగా కోళ్లను పెంచడం చూస్తూ ఉంటాం ..అలాగే ఇంకా కొంత మంది కోళ్లతో పాటు, పొట్టేళ్ల ను కూడా పెంచుతారు. కానీ మీరు ఎప్పుడైనా తేళ్ల పెంపకం గురించి విన్నారా.అవును మీరు విన్నది నిజమే ఇది అక్షరాలా నిజం. కోళ్లను పెంచినట్లుగానే తేళ్లను కూడా పెంచుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు వేల సంఖ్యలో తేళ్లను బాక్సుల్లో పెట్టి మరీ పెంచుతున్నారు.
ఇది టర్కీలోని శాన్లియుర్ఫా అనే ప్రాంతంలో ఈ తేళ్ల పెంపకం జరుగుతోంది. మెటిన్ ఓరెన్లర్ అనే వ్యక్తి తన పొలంలో తేళ్లను పెంచుతున్నాడు. 2020లో ఇతను 550 చదరపు మీటర్ల విస్తీర్ణంలో తేళ్ల పెంపకాన్ని ప్రారంభించాడట. కోళ్ల తరహాలో ఈ తేళ్లను పెంచుతున్నా కూడాబి ఇవి ప్రమాదకరం కావడంతో ప్రత్యేకంగా తయారు చేసిన ప్లాస్టిక్ బాక్సుల్లో వీటిని పెంచుతున్నారు. ఇతడి పొలంలో మొత్తం 20,000 కంటే ఎక్కువ తేళ్లు ఉన్నాయట. ఒక్కో తేలు రోజుకు 2 మిల్లీగ్రాముల విషాన్ని అందిస్తుందని ఇతను చెబుతున్నాడు. రోజూ తన పొలంలో 2 గ్రాముల విషాన్ని తీస్తున్నట్లు చెప్పాడు. తేళ్ల పెంపకం ఎంతో ప్రమాదకరమైన పని అయినా ఇందులో మంచి లాభం ఉండడంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని చేస్తున్నట్లు చెబుతున్నాడు.
లీటరు విషం రూ.కోట్లలో
మెటిన్ ఓరెన్లర్ తన పొలంలో ఆండ్రోక్టోనస్ టర్కియెన్సిస్ జాతికి చెందిన తేళ్లను పెంచుతున్నాడు. ఈ జాతి తేళ్లు ఆగ్నేయ టర్కీలో మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయట. ఈ తేలు విషంలో నొప్పితో పాటూ వృద్ధాప్య లక్షణాలను తగ్గించే యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయట. అందుకే ఈ విషం ఒక లీటర్ 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ.88కోట్లు) ధర పలుకుతోందని ఓరెన్లర్ చెబుతున్నాడు.
ప్రయోజనాలు ఏంటి ?
- ఈ తేలు విషం యాంటీయబాటిక్స్ మందులతో పాటూ సౌందర్య ఉత్పత్తుల తయారీల్లోనూ వాడతారట.
- వైద్య కంపెనీలు దీన్ని క్యాన్సర్ చికిత్స కోసం ఉపయోగిస్తాయని తెలుస్తోంది.
- ఈ విషంతో యాంటీ-విషం తయారీ చేపడతారట టర్నీలో .
ఈ తేలు విషం ప్రమాదకరం కావడం వల్ల ఎంతో జాగ్రత్తగా తీస్తారట. ఇందుకోసం అనుభవం కలిగిన సిబ్బంది.. ప్రత్యేకంగా తయారు చేసిన పట్టకార్లు ఉపయోగించి విషాన్ని బయటికి తీస్తారని చెబుతున్నారు. బయటికి తీసిన విషాన్ని ఓ కంటైనర్‌లో వేయగా.. అది వెంటనే ఘనీభవించి పొడిగా మారుతుందట. నాణ్యత పరీక్షల తర్వాత ఈ విషాన్ని ఎగుమతి చేసేందుకు ప్యాకింగ్ చేస్తారట.
ఎక్కడికి తరలిస్తారంటే..
టర్కీలో పోగు చేసిన ఈ తేలు విషాన్ని యూకే,ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్ తదితర యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు యజమాని తెలిపాడు. అక్కడ ఈ విషాన్ని ఔషధ, సౌందర్య పరిశ్రమల్లో వాడుతుంటారని చెప్పాడు.ఈ తేళ్లను పెంచుకోవడం కోసం టర్కీ ప్రభుత్వం నుంచి పొలాలకు లైసెన్స్ పొందాల్సి ఉంటుందని చెప్పాడు. ఇవి అడవి తేళ్ల జనాభాపై ప్రభావం చూపకుండా చూసుకోవాలి కూడా . ఈ వ్యాపారం సవాలుతో కూడుకున్నదైనా ఎంతో లాభదాయకమైనదని చెబుతున్నారు. టర్కీ, బ్రెజిల్, మెక్సికో వంటి దేశాల్లో మాత్రమే తేళ్ల పెంపకం చేపడుతుంటారు. తేళ్ల పెంపకంతో కోట్ల రూపాయలు సంపాదించడం కొత్తగా ఉండడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వ్యాపారంపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.