Pregnant woman dies due to hospital negligence
ప్రైవేటు ఆస్పత్రిలో గర్భిణి బలి!
అబార్షన్ చేస్తుండగా పరిస్థితి విషమం
ఖమ్మం తరలింపు, మహిళ మృతి
వైద్యుల తీరుపై బంధువుల మండిపాటు
సెటిల్మెంట్ చేసేందుకు యాజమాన్యం యత్నం
వైద్యవికటించి మృతి చెందిన మహిళకు
ఆస్పత్రి యజమాన్యం ఖరీదు కట్టింది. బాధితులు, ఆస్పత్రి యజమాన్యం మధ్య కొందరు పెద్దమనుషులుగా చెలామణయ్యే వ్యక్తులు రాజీకుదిర్చారు. ప్రాణం ఖరీదుగా రూ.25 లక్షలు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మోతే మండలం రాఘవపురం గ్రామానికి చెందిన అరుణ అనే మహిళ మూడోసారి గర్భం దాల్చింది. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేరగా స్కానింగ్ లో ఆడశిశువు ఉన్నట్లు తేల్చి అబార్షన్ చేసేందుకు ప్రయత్నం చేశారు. దీంతో రక్తస్రావం తీవ్రమై పరిస్థితి విషమించింది. హుటాహుటిన ఖమ్మం తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ఆదివారం మృతి చెందింది. వెంటనే యాజమాన్యం అక్కడికే వెళ్లి సెటిల్మెంట్ చేసి విషయాన్నీ బయటకు పొక్కకుండా మూసేశారు.
రాత్రికి రాత్రే ఆసుపత్రి మూసివేత
గర్భిణులు మృతి చెందడంతో బాధిత కుటుంబంతో సెటిల్మెంట్ చేసి ఆసుపత్రిని రాత్రికి రాత్రే మూసేశారు. ఆసుపత్రి బోర్డులు తొలగించి పరారీలో ఉన్నట్లు సమాచారం. అబార్షన్ చేస్తూ మృతి చెందిన మహిళ ప్రాణానికి ఆసుపత్రి యాజమాన్యం ఖరీదు కట్టారు. రంగంలోకి దిగిన మధ్యవర్తులు బాధితుల కుటుంబంతో మాట్లాడి పోయిన ప్రాణం తిరిగి రాదు ఎంతో అంత సెటిల్ చేసు కోవాలని ఒప్పించి 25 లక్షలకు ఒప్పించినట్లు సమాచారం.