ఒక్కసారి వరి వేస్తే ఆరు సార్లు కోతకి ఘనంగా లాభాలు | Plant rice once and reap it six times, reaping huge profits 2025

Plant rice once and reap it six times

ఒక్కసారి వరి వేస్తే ఆరు సార్లు కోత……

17 దేశాలతో పాటు తమిళనాడు, ఒడిశాలో ప్రయోగాత్మక సాగుకు శ్రీకారం

ఒక్కసారి నాట్లేసి మూడేళ్లలో వరుసగా ఆరు సార్లు పంట కోసుకునే రోజులు రానున్నాయి. ఇలాంటి వరిని ‘పెరెన్నియల్‌ రైస్‌'(పీఆర్‌) అంటున్నారు. ఈ విలక్షణ వరి వంగడాలను రూపొందించుకున్న చైనా ఏడేళ్లుగా సాగు చేస్తోంది. ఉత్పత్తి ఖర్చులు 40% మేరకు తగ్గుతాయి. నికరలాభం పెరుగుతుంది.పనిలో పనిగా భూసారం, జీవవైవిధ్యం కూడా పెరుగుతుంది. చైనా తదితర దేశాల్లో ఏటేటా పీఆర్‌ వరి సాగు విస్తరిస్తోంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) కూడా దీనిపై తాజాగా దృష్టి సారించింది. ‘ఫార్మింగ్‌ సిస్టం’ జర్నల్‌ తాజా సంచికలో భారతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఐఆర్‌ఆర్‌) శాస్త్రవేత్త డాక్టర్‌ విజయకుమార్‌ షణ్ముగం రాసిన అధ్యయన పత్రం ఆధారంగా ప్రత్యేక కథనం

ఖర్చులు పెరిగిపోవటం, ఆదాయం తగ్గిపోవటం, నీటి అవసరాలు పెరగటం, భూసారం క్షీణించటం, హరితగృహ వాయువులతో పర్యావరణానికి తీరని హాని జరగటం.. ఇవీ ప్రస్తుతం మన దేశంలో వరి వ్యవసాయాన్ని వేధిస్తున్న సవాళ్లు. దాదాపు ఈ సమస్యలన్నిటికీ ఏకకాలంలో చెక్‌ పెట్టే అద్భుతమైన ‘పెరెన్నియల్‌ రైస్‌’ వంగడాలను చైనా శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ వరి వంగడాలను చైనాలో రైతులు ఏడేళ్లుగా సాగు చేస్తున్నారు.సాధారణంగా వరి పంటను ఒక్కసారి నాటితే ఒక్కసారే పంట చేతికి వస్తుంది. తర్వాత సీజన్‌లో మళ్లీ దున్ని, దమ్ము చేసి, నాట్లు వేసుకుంటున్నాం. ఈ వంగడం ఒక్కసారి నాటితే చాలు. మొత్తంగా చూస్తే పీఆర్‌ వరుసగా 6 సీజన్లలో తిరిగి పెరిగే వరి పంటను కోసుకోవచ్చు. పటిష్టంగా ఉండే కుదుళ్లు పంట కోసిన తర్వాత మళ్లీ చిగురించి, పిలకలన్నీ మొదటి పంటలాగే ఏపుగా పెరగటం పీఆర్‌23 వంగడం ప్రత్యేకత.

Leave a Comment