Cyclone Montha intensifies: హుద్‌హుద్‌ తుఫాను తర్వాత ఇక్కడ ఏడో నంబర్‌ ప్రమాద హెచ్చరిక 2025

Cyclone Montha intensifies

మొంథా తుఫాను తీవ్ర రూపం

గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు

హుద్‌హుద్‌ తుఫాను తర్వాత ఇక్కడ ఏడో నంబర్‌ ప్రమాద హెచ్చరిక

రైతు ప్రస్థానం మొంథా తుఫాను తీవ్ర రూపం దాల్చుతుండడంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈదురుగాలుల తీవ్రత కూడా మరింత పెరిగింది. కాకినాడలో ఇప్పటికే హైఅలర్ట్‌ ప్రకటించారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తూ ఉండడంతో కాకినాడ పోర్టులో ఏడో నంబర్‌ ప్రమాద హెచ్చరికని జారీ చేశారు. 2014లో హుద్‌హుద్‌ తుఫాను తర్వాత ఇక్కడ ఏడో నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం ఇదే తొలిసారి. పోర్టులో కార్గో ఎగుమతి, దిగుమతులను ఇప్పటికే నిలిపివేశారు.

16 నౌకలను బెర్త్‌ల నుంచి సముద్రంలోకి తరలించారు. ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. బీచ్‌ రోడ్డును భారీగా అలలు తాకాయి. కోత నివారణకు అడ్డంగా నిర్మించిన బండరాళ్లు సైతం కదిలించాయి. తుఫాను ప్రభావం కాకినాడ జిల్లాలో 12 మండలాల్లో అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. 12 మండలాల పరిధిలో 67 గ్రామాల్లో నష్టం ఎక్కువగా ఉంటుందని అంచనా. 269 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. తీరప్రాంత మండలాల్లో ఉంటున్న 9,500 మందిని పునరావాస శిబిరాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో జాతీయ రహదారులపై ప్రయాణించే భారీ వాహనాల రాకపోకలను ఈ రోజు రాత్రి 7.00 గంటల నుండి నిలిపివేయడం జరుగుతుంది. అదే విధంగా అన్ని జాతీయ రహదారులు మరియు రాష్ట్ర హైవేల్లో ప్రైవేటు మరియు వాణిజ్య వాహనాల ప్రయాణం పూర్తిగా నిషేధించబడుతుంది.వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించుకోవాలని లేదా సురక్షిత ప్రదేశాల్లో వాహనాలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా రోడ్లపై ప్రయాణాలు చేయకుండా సహకరించాలన్నారు.\


Follow On:-

Leave a Comment