రాష్ట్రంలో 15 రోజులు ముందుగానే రుతుపవనాలు ప్రవేశించడంతో వానాకాలం సీజన్‌లో | CM video conference with district collectors

CM video conference with district collectors

రాష్ట్రంలో 15 రోజులు ముందుగానే రుతుపవనాలు ప్రవేశించడంతో వానాకాలం సీజన్‌లో పంటల సాగు విషయంలో రైతులకు అవసరమైన తక్షణ చర్యలపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచడం, మిగిలిపోయిన చోట ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి, ఇసుక అక్రమ రవాణా వంటి కీలకమైన అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, ఇతర మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి పలు సూచనలు చేశారు.

సీజన్ కు అనుగుణంగా తీసుకోవలసిన చర్యలపై ఆయా జిల్లాల ఇంచార్జీ మంత్రులు 29, 30 తేదీల్లో జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశాలు నిర్వహించి జూన్ 1 నాటికి నివేదికలు అందజేయాలని చెప్పారు. రాబోయే నెల రోజులు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తూ అధికార యంత్రాంగాన్ని పరుగెత్తించాల్సిందేనని స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 64.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, సేకరించిన ధాన్యంపై 48 గంటల్లో రైతులకు రూ. 12,184 కోట్లు చెల్లించినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 90 శాతం మేరకు ధాన్యం సేకరణ పూర్తి చేయడంపై ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా కలెక్టర్లను అభినందించారు.

అలాగే, రుతుపవనాలు ముందుగా రావడంతో మిగతా ధాన్యం సేకరించే విషయంలో అక్కడక్కడ ఇబ్బందిగా మారిన విషయాన్ని ప్రస్తావించి తీసుకోవలసిన చర్యలను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 29 శాతం అధిక వర్షపాతం నమోదైందని, సీజన్ ముందుగా రావడంతో ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. మిగిలిపోయిన చోట ధాన్యం సేకరణ విషయంలో కలెక్టర్లు ప్రో యాక్టివ్‌గా ఉండాలని, వానాకాలం సీజన్‌లో తీసుకోవలసిన చర్యలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి, ఇసుక అక్రమ రవాణా నియంత్రణలో తీసుకోవలసిన చర్యలపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా తీసుకోవలసిన చర్యలను వివరించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Comment