Cm Revanth Reddy Meeting With Aadi Vaasi: ఆదివాసీ సంఘాలు, ప్రజా ప్రతినిధులతో సచివాలయంలో సమావేశమయ్యారు
రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఆదివాసీ సంఘాలు, ప్రజా ప్రతినిధులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆదివాసీ సంఘాల ప్రతినిధులు విద్య, ఉద్యోగావకాశాలు, రోడ్లు, రవాణా, సాగు, తాగునీటి వంటి పలు అంశాలు, సమస్యలను ముఖ్యమంత్రి గారికి విన్నవించారు. ఆదివాసీల కోసం ఇప్పటికే చేపట్టిన పలు విషయాలను ప్రస్తావిస్తూ వారు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
కొమురం భీమ్ జయంతి, వర్ధంతిలను అధికారిక ఉత్సవంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అలాగే పలు అంశాలపై అధికారులకు సూచనలిచ్చారు. ఐటీడీఏ ప్రాంతాలకు జనాభా ప్రాతిపదికన ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలి. స్పెషల్ డ్రైవ్ కింద ఇందిర జలప్రభ ద్వారా ఉచితంగా బోర్లు వేసేందుకు చర్యలు చేపట్టాలి. ఆదివాసీ రైతుల వ్యవసాయ బోర్లకు సోలార్ పంపుసెట్లు ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ఆదివాసీ గూడాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి.ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని స్మృతి వనంగా మార్చాలని, అమరుల కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయడం వంటి చర్యలు ఇప్పటికే తీసుకున్నాం. రాజకీయంగానూ ఆదివాసీలకు న్యాయం చేస్తూ ముందుకు వెళుతున్నాం. అలాగే ఆదివాసీలు విద్య, ఉద్యోగ, ఆర్ధిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం.ఆదివాసీల మాతృ భాషలో విద్యను అందించడం, గోండు భాషలో ప్రాథమిక విద్యను అందించే అంశంపై అధ్యయనం చేసి నివేదిక అందించాలి. ఆదివాసీల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్, మౌలిక సదుపాయాలను వెంటనే మంజూరు చేస్తున్నాం.
విదేశాల్లో చదువుకునే ఆదివాసీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్ షిప్పులకు సంబంధించి పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలి. ఇప్పటికే మంజూరైన బీఈడీ కళాశాలకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి.ఆదివాసీ రాయి సెంటర్లకు భవనాలు నిర్మించేందుకు అధ్యయనం చేసి నివేదిక తయారు అందించాలి. కేస్లాపూర్ జాతరకు నిధులు మంజూరుకు చర్యలు తీసుకోవాలి. ఉద్యమాల్లో ఆదివాసీలపై పెట్టిన కేసులు తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈ సమావేశంలో మంత్రి ధనసరి సీతక్క గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.