CM Revanth Reddy Good News To Home guards: హోంగార్డులకు ముఖ్యమంత్రి వరాలు 2024
సమాజాన్ని పట్టి పీడిస్తున్న సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ మహమ్మారిని నిరోధించడానికి పోలీసు శాఖలో సుశిక్షితులైన వారితో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని దిశానిర్ధేశం చేశారు.
సమాజంలో కొత్త పుంతలు తొక్కుతున్న నేరాలను అరికట్టడంలో సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీసు శాఖకు సూచించారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ మహమ్మారిని నిరోధించడానికి పోలీసు శాఖలో సుశిక్షితులైన వారితో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని దిశానిర్ధేశం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తిని, పోలీస్ రైజింగ్ డేను స్మరిస్తూ, ప్రజా సేవ కోసం ఎక్కువ సమయం విధి నిర్వహణలో ఉంటున్న హోంగార్డులకు ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా పలు వరాలను ప్రకటించారు.
ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమాల్లో భాగంగా హోం శాఖ విజయాలపై నెక్లెస్ రోడ్డు హెచ్ఎండీఏ మైదానంలో నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారితో కలిసి పాల్గొన్నారు. పోలీసు శాఖలోని వివిధ విభాగాలు, డాగ్ స్వ్కాడ్‌లు ఇచ్చిన ప్రదర్శనలను తిలకించారు.ఆయా విభాగాలు వినియోగించే ఆయుధాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన పరికరాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. ట్రాఫిక్ అసిస్టెంట్స్‌గా నియమితులైన ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు నియామక పత్రాలను అందించారు.అనంతరం ముఖ్యమంత్రి గారు సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ…గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను నిరోధించడంలో కొంత ప్రగతి సాధించినప్పటికీ ప్రస్తుత చర్యలు సరిపోవు. మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ వంటి కేసుల్లో న్యాయస్థానాల్లో కఠిన శిక్షలు పడే విధంగా స్పెషల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి సుశిక్షితులైన అధికారులను నియమించాలి. ఈ కేసుల కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం.
హైదరాబాద్ నగరంలో ప్రధానంగా కాలుష్యం తగ్గించడం, ట్రాఫిక్ ను నియంత్రించాల్సిన అవసరం ఎంతో ఉంది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ట్రాన్స్ జెండర్లు అడుక్కునే దృశ్యాలను గమనించి, వారు ఆత్మగౌరవంతో బతకడానికి, జనజీవన స్రవంతిలో చేర్చాలన్న ఉద్దేశంతో ట్రాఫిక్ అసిస్టెంట్స్‌గా విధుల్లోకి తీసుకోవడం జరిగింది. సమాజంలో వారు వివక్షకు గురికావొద్దు.విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్న పోలీసు ఉన్నతోద్యోగులకు పరిహారం చెల్లిస్తున్నట్టుగానే, హాం గార్డులు ఎవరైనా ప్రమాదవ శాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని నిర్ణయించాం.అలాగే, హోం గార్డులకు రోజుకు 921 రూపాయలు చెల్లిస్తుండగా, ఇకనుంచి 1000 రూపాయలకు పెంపు. వీక్లీ పరేడ్ అలవెన్స్ రూ.100 నుంచి రూ.200 కు పెంపు. ప్రభుత్వ ఉద్యోగులకు వైద్య సౌకర్యాలు అందుతున్నట్టుగా హోం గార్డులకు ఆ సౌకర్యాలు లేని కారణంగా వారి కుటుంబాలను రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తాం. ఇవన్నీ జనవరి ఒకటి నుంచి అమలు చేస్తాం.
పోలీసు పిల్లలు సైతం ఉన్నతమైన విద్యను అభ్యసించాలన్న లక్ష్యంతో నేషనల్ డిఫెన్స్ అకాడమీ, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్ స్కూళ్లకు తీసిపోకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి 50 ఎకరాల్లో పోలీస్ స్కూల్ ప్రారంభిస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారంటే పోలీస్ స్కూల్ నుంచి వచ్చామని సగర్వంగా చెప్పుకునే స్థాయిలో తీర్చిదిద్దుతాం.సమాజానికి ఎన్నో సేవలు అందిస్తున్న పోలీసు ఉద్యోగం అంటే మీకు ఉపాధి కాదు. ఇదొక భావోద్వేగం. ప్రభుత్వ ప్రతిష్టను కాపాడే బాధ్యత మీపైన ఉంది. ప్రెండ్లీ పోలీసు అంటే… బాధితుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి. బాధితులు, అన్యాయానికి గురైన వారి పట్ల గౌరవంగా వ్యవహరించాలి. కబ్జాలు, హత్యలు, ఆర్థిక నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలి. నేరగాళ్లకు ప్రొటోకాల్ పాటిస్తే మీరు మీ విధులను నిర్వర్తించలేరు.
సమాజంలో ఎక్కువ సేవలు అందిస్తున్నది పోలీసులే. అలాగే ఎక్కువ విమర్శలు ఎదుర్కోనేది కూడా పోలీసులే. యూనిఫామ్ ఫోర్స్ అంటే క్రమశిక్షణతో ఉండాలి. మీకేవైనా సమస్యలు ఉంటే వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజల సమస్యలను పరిష్కరించే మీకు సమస్యలు ఉండొద్దు… అని ముఖ్యమంత్రి గారు వివరించారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులతో పాటు హోం శాఖ కార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ఆయా విభాగాల అధిపతులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.