ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష సమావేశం | CM Revanth Reddy Emegency Meeting for Terror 2025

CM Revanth Reddy Emegency Meeting for Terror

దేశ భద్రతా బలగాలు ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఆర్మీ, పోలీసు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఇతర అత్యవసర విభాగాలతో తాజా పరిణామాలను సమీక్షించిన ముఖ్యమంత్రి గారు ఇలాంటి సందర్భాల్లో తీసుకోవలసిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.భారత సైనిక బలగాలకు సంఘీభావంగా, అండగా ఉన్నామని సందేశం ఇవ్వడానికి తెలంగాణ ప్రజల తరఫున గురువారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. “తీవ్రవాద వ్యతిరేక పోరాటాలకు సంఘీభావ ప్రకటన” గా ఈ ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు.ఇలాంటి సమయాల్లో రాజకీయాలకు, పార్టీలకు సంబంధించిన వివాదాలకు తావులేదని చెప్పారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సర్వసన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు ఆయా విభాగాలకు స్పష్టంగా పలు ఆదేశాలిచ్చారు.

మంత్రులు, అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలి. అత్యవసర సర్వీసులు అందించే విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సెలవులు రద్దు చేయాలి. ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలి. విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలి.వైద్యం, పౌరసరఫరాలు, విద్యుత్ వంటి అత్యవసర సేవల విభాగాలన్నీ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలి. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమాచారం కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.పరిస్థితిని ఆసరా చేసుకుని సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రకటనలు చేసే వారి పట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని, సైబర్ సెక్యూరిటీ విభాగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ముఖ్యంగా తప్పుడు సమాచారం వ్యాప్తి జరక్కుండా ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపైన కఠినంగా వ్యవహరించాలి. ఫేక్ న్యూస్‌ను, పుకార్లు వ్యాప్తిని అరికట్టడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు.రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూంకి అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో 24 గంటలు అప్రమత్తంగా ఉండటంతో పాటు భధ్రతను పెంచాలి.హైదరాబాద్ నగరంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సందర్భంగా పీస్ కమిటీలతో సమావేశం కావాలని చెప్పారు. పాత నేరస్తులు, ఇతర నేర చరిత్ర కలిగిన వారిపట్ల పోలీసులు అప్రమత్తంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.ఈ సమావేశంలో ఆర్మీ, పోలీసు, ఇతర అత్యవసర విభాగాలకు చెందిన ఉన్నతస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Leave a Comment