CM Revanth Lunched Indiramma Indlu Survey App : మొదటి ప్రాధాన్యత కింద ఇండ్ల కేటాయింపు వీరికే
తెలంగాణలో అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు నిర్మించాలన్న లక్ష్యంతోనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను జోడించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించినట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు చెప్పారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారితో పాటు ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యం ఎంత గొప్పదైనప్పటికీ అమలులో లోపాలుంటే ప్రభుత్వంపై విశ్వసనీయత దెబ్బతింటుంది. పేదవారికి అన్యాయం జరుగుతుంది. అందుకే సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి ఏ ఒక్క ఇళ్లు కూడా అనర్హులకు చెందకూడదని ప్రత్యేకంగా యాప్ అందుబాటులోకి తెచ్చామని ఈ సందర్భంగా వివరించారు.ఇందిరమ్మ ఇండ్లను ప్రాధాన్యత క్రమంలో కేటాయిస్తాం.
ప్రాధాన్యత వీరికే
అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత కింద ఇండ్ల కేటాయింపు జరుగుతుంది.
- ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్‌లకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఇండ్లను కేటాయిస్తాం.
- ఉన్న స్థలాన్ని గరిష్టస్థాయిలో వినియోగించుకుని నిర్మించుకునేలా లబ్దిదారుల కోసం ప్రతి మండల కేంద్రంలో ఒక నమూనా ఇంటిని నిర్మించి చూపిస్తాం.
- అచ్చం అలాగే కట్టాలని కాకుండా అవగాహన కోసం మాడల్ హౌజ్‌ను చూపిస్తారూ.
- తొలి సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్ల కేటాయింపులో భాగంగా మొత్తంగా 4.50 లక్షల ఇండ్లకు ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నిధులకు పరిపాలనా అనుమతులు.
- ఆదివాసీలు, ఆదివాసీ తండాలు (ఐటీడీఏ తండాలకు) జనాభా ప్రాతిపదికన ప్రత్యేకంగా పరిశీలించి అదనంగా కొన్ని వేల ఇండ్లను నిర్మిస్తాం.
ఇప్పుడు కేటాయించిన ఇండ్లు కాకుండా ఆదివాసీలకు ప్రత్యేక కోటా ఇస్తామన్నారు.గతంలో రుణాలు తీసుకుని ఇండ్లు కట్టుకున్న 7 వేల కుటుంబాల రుణాలను కూడా ప్రభుత్వం తీర్చి వారిని రుణ విముక్తులను చేస్తుంది.పెరిగిన ధరలు, పేదవాడి అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారికి ఇండ్లు కట్టుకోవడానికి అండగా నిలవాలని ఈ పథకం తీసుకొచ్చింది అని పేర్కొన్నారు . పెరిగిన ధరలు, పేదల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి పేద వాడికి 5 లక్షలు ఇచ్చి ఇండ్లు కట్టుకోవడానికి ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం .
- 2004 నుంచి 2014 వరకు 25.04 లక్షల పేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం జరిగింది.
- 2014-2013 కాలంలో 1. 52 లక్షలు డబుల్ బెడ్రూమ్ ల నిర్మాణం చేపడితే వాటిల్లో 60 నుంచి 65 వేల ఇండ్లు మాత్రమే పూర్తి చేయగా, అర్థాంతరంగా వదిలేసిన ఇండ్లను పూర్తి చేయడానికి ప్రజా ప్రభుత్వం 195 కోట్లను కేటాయించింది.
పేదలకు వెసులుబాటు కల్పిస్తూ విధివిధానాలను నిర్ణయించామని స్థలం పెద్దగా ఉన్న వారు అదనంగా ఒక గది కట్టుకుంటామంటే అందుకు వెసులుబాటు కల్పించామని అన్నారు.ఇండ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వంది.ప్రతి ఒక్కరి కల ఆత్మగౌరవంతో బ్రతకడం . ఇందిరమ్మ రాజ్యంలో ఇంటిముందు వెలుగుల్లో పండుగ చేసుకునే సందర్భమిది అని సీఎం కొనియాడారు .ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇతర ప్రజా ప్రతినిధులు, సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ఇతర అధికారులు పాల్గొన్నారు.