CM Reavnth Reddy Started Chakali Ilamma University
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ ఉన్నతస్థాయి ప్రమాణాలతో ప్రపంచస్థాయి యూనివర్సిటీగా ఎదగాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ఆకాంక్షించారు. అత్యుత్తమ ప్రమాణాలతో యూనివర్సిటీలో హాస్టళ్లు, ఆడిటోరియం, క్రీడా మైదానం వంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.
ప్రపంచ మహిళా దినోత్సవం రోజున హైదరాబాద్ కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం లో 535 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన, చారిత్రాత్మక దర్బారు హాలు పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, “ప్రపంచ మహిళా దినోత్సవం రోజున ఆడబిడ్డల నుంచి కోరుకుంటున్నది ఒక్కటే. మీరంతా జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలి. ఉన్నత విద్యలో రాణించాలి. విద్యలో రాణించినప్పుడే కుటుంబాలు బాగుపడుతాయి. ఉన్నత విద్యలో రాణిస్తారని ఆకాంక్షిస్తున్నా” అని అన్నారు. ప్రస్తుతం ప్రారంభించిన పనులు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణాలు పూర్తి కావాలని, అవసరమైతే ఇంకో వంద రెండు వందల కోట్లు కావాలన్నా నిధులు కేటాయిస్తాం. రెండు మూడేళ్లలో ఈ పనులన్నీ పూర్తి కావాలి. ఈ యూనివర్సిటీ ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫోర్డ్ లాంటి అంతర్జాతీయ యూనివర్సిటీలతో ఈ యూనివర్సిటీ పోటీ పడి రాణించాలని ఆకాంక్షించారు.
1924 లో కేవలం ఏడుగురు విద్యార్థులతో ప్రారంభమైన మహిళా విద్యాలయం ఈరోజు దాదాపు 7 వేలకు చేరుకోవడమే కాకుండా ఒక యూనివర్సిటీగా రూపుదిద్దుకోవడం శుభపరిణామమని అన్నారు. గడీలకు, జమిందార్లకు వ్యతిరేకంగా పోరాటానికి, పౌరుషానికి ప్రతిరూపమైన చాకలి ఐలమ్మ పేరును వర్సిటీకి పెట్టుకోవడం సంతోషంగా ఉందన్నారు. చట్ట సభల్లో అడుగుపెట్టడానికి అందరూ నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని, అప్పుడే తెలంగాణ అభివృద్ధి పథంలో పయనిస్తుందని అన్నారు.రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు, ఉన్నత విద్యా మండలి చైర్మన్, వర్సిటీ వైఎస్ చాన్సలర్ సూర్య ధనుంజయ్ గారితో పాటు ఆయా యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.