Central Govt All Emergency Single Number
ఇకపై అన్నింటికీ ఒకటే ఎమర్జన్సీ నెంబర్.. కొత్త నెంబర్ ఇదే !
దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చింది. ఎమర్జెన్సీ సేవల కోసం ఒకే టోల్‌ఫ్రీ నంబర్ – 112ను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఇప్పటి వరకు పోలీస్ సహాయం (100), అంబులెన్స్ (108), మహిళల భద్రత (181).. బాలల హక్కుల పరిరక్షణ (1098), ప్రకృతి విపత్తుల (1077) వంటి విభిన్న సేవల కోసం వేర్వేరు నంబర్లను ప్రజలు ఉపయోగించేవారు.అయితే ఇప్పుడు వీటి స్థానంలో ఒక్కటే నంబర్ – 112 కొనసాగనుంది. ఈ మార్పుతో అన్ని అత్యవసర సేవలకు వేగంగా.. సమర్థవంతంగా స్పందించేందుకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. ఇప్పటి నుంచి రాష్ట్రంలో 112 నంబర్‌ను యాక్టివ్ మోడ్‌లో అమలు చేస్తున్నామని తెలిపారు. 112 నంబర్‌కు ఫోన్ చేయగానే, కాల్ కేంద్రం లొకేషన్‌ను జీపీఎస్ ఆధారంగా ట్రాక్ చేసి.. సంబంధిత పోలీస్ స్టేషన్, అంబులెన్స్ లేదా ఫైర్ సర్వీసులకు సమాచారం పంపుతుంది.
అత్యవసర పరిస్థితుల్లో రిస్పాన్స్ టైమ్‌ను గణనీయంగా తగ్గించేందుకు అవసరమైన మౌలిక వసతులు, టెక్నాలజీ టూల్స్‌తో వ్యవస్థను అప్‌గ్రేడ్ చేశారు. కాల్‌కు స్పందించడానికి ప్రత్యేకంగా ట్రెయిన్డ్ సిబ్బంది 24/7 విధులలో నియమితులయ్యారు. ఆండ్రాయిడ్ లేదా iOS స్మార్ట్‌ఫోన్లలో ప్యానిక్ బటన్ని నొక్కినట్లయితే వెంటనే 112కు కాల్ అవుతుందని స్పష్టం చేశారు. అలాగే 112 India Appను డౌన్‌లోడ్ చేసుకుని, రిజిస్టర్ చేసుకున్నట్లయితే… ఒకే టచ్‌తో పోలీసులు, అంబులెన్స్, ఫైర్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
మహిళల కోసం ప్రత్యేకంగా SOS ఫీచర్లు, ఫేక్ కాల్ సిస్టమ్ వంటి భద్రతా ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మరోవైపు స్కూళ్లు, కాలేజీలు, కమ్యూనిటీ హాల్స్ లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా, పత్రికలు, టీవీ చానళ్లలో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ అవగాహన వాహనాల ద్వారా సమాచారాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు.