Bhu Bharathi Portal New Version Lunched 2025
సాగు భూమికి సంబంధించి వ్యవసాయేతర అవసరాలకు అనుమతి పొందకుండా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద రిజిస్ట్రేషన్‌కు వెళ్తే ఇక విషయం ఇట్టే తెలిసిపోనుంది. మనకు ఏదైనా భూ సర్వే అవసరమైతే ఆ సమాచారం ఆన్లైన్లోనే ఇక పొందడానికి మార్గం సుగమం కానుంది. నక్షా, సర్వే పటాలు అందుబాటులోకి రానున్నాయి. ఇక స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ, భూమి కొలతల దస్త్రాల నిర్వహణ శాఖ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమాచారం సులువుగానే పొందవచ్చు. ఈ మూడు సేవలకు మూడు కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేయడానికి అడ్డుకట్ట పడనుంది.
జనవరి నుంచి రెవెన్యూ శాఖ అందుబాటులోకి తీసుకురానున్న పూర్తిస్థాయి భూ భారతి పోర్టల్ ఇక బహుళ ప్రయోజనకారిగా మారబోతుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే దాదాపు కొలిక్కి రాగా, కొన్నిరోజులు ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నట్లు సమాచారం. ఇప్పుడున్న భూ భారతి పోర్టల్‌లో కేవలం సాగుభూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లకు మాత్రమే వెసులుబాటు ఉండగా, ఇప్పుడు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మాత్రం మరెన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి.
భూ భారతి పోర్టల్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే :
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ (కార్డ్) ద్వారా అందించే సేవలన్నీ ఈ పోర్టల్ నుంచే పొందవచ్చు. స్థిరాస్తులకు సంబంధించిన స్లాట్ నమోదు చేసుకోవడం, ఈసీలు పొందడం, సర్టిఫైడ్ డాక్యుమెంట్లు పొందడం లాంటి సేవలు అందుబాటులోకి రానున్నాయి.ఏదైనా సర్వే పటం కావాలంటే భూమి కొలతలు, భూ దస్త్రాల నిర్వహణ శాఖకు దరఖాస్తు చేసుకునే పని ఉండదు. ఇక నేరుగా భూ భారతి పోర్టల్‌ను ఆశ్రయించవచ్చు.ప్రభుత్వ భూములకు (నిషేధిత జాబితాలోని 22ఏ) రిజిస్ట్రేషన్లు కాకుండా అరికట్టడానికి వీలు ఉంటుంది.భూముల సర్వే, సరిహద్దు వివాదాలపై స్పష్టత కోరవచ్చును.
అటవీ, రెవెన్యూ, వక్ఫ్ , దేవాదాయ తదితర ప్రభుత్వ భూములతో సరిహద్దు సమస్యల వివరాలు కూడా ఈ పోర్టల్‌లో పొందవచ్చు.రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు కూడా ఇది ఉపయోగపడనుంది.జనవరిలో భూ యజమానులకు జారీ చేయనున్న తాత్కాలిక భూధార్‌తో భూ సంబంధిత సమగ్రమైన సేవలు ఈ పోర్టల్ ద్వారా అందుబాటులోకి రానుంది.బ్యాంకు రుణాలు, తాకట్టు, వ్యవసాయ సంబంధిత అవసరాలకు యాజమాన్య హక్కుల పరిశీలన కూడా ఈ పోర్టల్ ద్వారా జరగనుంది.నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) రూపొందిస్తున్న ఈ పోర్టల్ చివరి దశకు చేరుకుంది. ఇంకా కొన్ని రోజుల్లోనే వినియోగంలోకి రానుంది.పూర్తిస్థాయి పోర్టల్‌తో ఇంతవరకు వేర్వేరుగా అమలు అవుతున్న భూములకు సంబంధించిన అన్ని సేవలు ఒకే వేదికపై లభ్యం కానున్నాయి.
భూ భారతి పోర్టల్‌లో అన్ని భూ విషయాలు :సాగుభూమికి సంబంధించిన సమాచారం, వ్యవసాయేతర భూమికి చెందిన సమాచారం, భూ సర్వే, మీ భూమి ఎవరి పేరు మీద ఉంది అనే విషయాలు తెలియాలంటే ఇకపై రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అలాగే ‘మీ సేవ’ల చుట్టూ కూడా ప్రదక్షణలు చేయాల్సిన పరిస్థితే రాదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి పోర్టల్‌ను తీసుకువచ్చింది. ఈ పోర్టల్‌లో ఇంటి వద్ద నుంచే మీ భూమికి సంబంధించిన విలువైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. మీ భూమికి సంబంధించి ఏ అధికారికి మీ చేతులు తడుపుకోవాల్సిన పనే ఉండదు.
తొలగనున్న భూ సమస్యలు : రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణి పోర్టల్‌ను భూ భారతి పోర్టల్‌గా తీసుకువచ్చారు. అయితే ఇక్కడ కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. వెంచర్లు, ప్లాట్లుగా మారుతున్న భూములను వెంటనే సాగు భూముల జాబితా నుంచి తప్పించకపోవడంతో కొనుగోలు చేసిన యజమానులు నానా అవస్థలు పడుతున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల మధ్య సమన్వయం లోపం కూడా దీనికి ఒక కారణంగా చెప్పవచ్చు. అందుకే ఇప్పుడు ఆ సమస్యలను పరిష్కారం చేయడానికి భూ భారతి పోర్టల్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నారు.-








