ఈ భూములు పట్టా చేసుకోవడానికి ఆంక్షలు ఎత్తివేసిన ప్రభుత్వం | Assigned Lands going to patta Lands in AP 2025

Assigned Lands going to patta Lands in AP

రైతులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు . రాజధాని నిర్మాణం కోసం తమ అసైన్డ్‌ భూములను ప్రభుత్వానికి ఇచ్చిన రైతులకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. వారికి ఇచ్చిన రిటర్నబుల్‌ ప్లాట్లలో “అసైన్డ్‌” అనే పదం ఉండటంతో, ఆ స్థలాలు అమ్ముడుపోకుండా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.ఐతే దీనిపై రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను గమనించిన సీఎం చంద్రబాబు నాయుడు రిటర్నబుల్‌ ప్లాట్లను “ఇకపై పట్టా భూమి”గా పరిగణించాలని ఆదేశాలు జారీ చేశారు .

పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్‌ దీననుసరించి జీ.వో. నెం.187ను విడుదల చేశారు. జీవో నెంబర్ 187 ద్వారా రైతులకు వచ్చిన ప్లాట్లు అధికారికంగా పట్టా భూములుగా మారాయి.గతంలో సీఆర్డీయే ఇచ్చిన ప్లాట్లలో “అసైన్డ్‌” అనే గుర్తింపు ఉండటంతో, వాటిని మార్కెట్లో విక్రయించేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ భూములను కొనడానికి కొనుగోలు దారులు ముందుకు రాకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు చూశారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా, సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి ఆ పదాన్ని తొలగించాలని ఆదేశించారు. దీంతో ఇప్పుడు ఆ ప్లాట్లకు పూర్తిస్థాయి పట్టా హక్కు లభించింది. దీంతో రైతులు వాటిని అమ్ముకునే అవకాశం వచింది.

ఈ నిర్ణయం అమలులోకి రావడంతో రైతులకు ఆర్థిక లాభం దక్కనుంది.ఐతే రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రిటర్నబుల్ ప్లాట్లపై రుణాల అంశం. గత ప్రభుత్వ కాలంలోనుంచి ఈ ప్లాట్లను రుణాలకు తనఖా పెట్టడానికి బ్యాంకులు అంగీకరించడం లేదు. మార్గదర్శకాలు లేవని, తనఖాగా పరిగణించలేమని కారణాలు చెబుతూ వెనక్కి తగ్గుతున్నాయి. ఈ ఏడాది జూలై 25న జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ ప్రత్యేకంగా రుణాలు ఇవ్వాలని కోరినా, ఇప్పటికీ పరిస్థితి మారలేదు. రైతులు బ్యాంకులకు వెళ్లినా సిబ్బంది…..

పాత కారణాలనే చెబుతున్నారు.ప్రస్తుతం అసైన్డ్ భూముల గుర్తింపును తొలగించి పట్టా భూములుగా మార్చిన నిర్ణయం రైతులకు ఊరట ఇచ్చింది. కానీ రుణాల అంశం పరిష్కారం కాకపోవడంతో వారు నిరాశ చెందుతున్నారు. రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులు ప్రభుత్వాన్ని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు. తమ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్న ప్రభుత్వం, ఈసారి కూడా రుణాల అంశంలో దృఢమైన చర్యలు తీసుకుంటుందనే నమ్మకం రైతుల్లో ఉంది. మరి బ్యాంకులు కూడా ప్రభుత్వ ఆదేశాలను పాటించి రైతులకు సహకరించనున్నాయా అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

Leave a Comment