lpg-cylinder-connection-cut-from-june-1-png-users
దేశవ్యాప్తంగా వంటగ్యాస్ (LPG) వినియోగాన్ని క్రమబద్ధీకరించడానికి మరియు కొరతను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధనలను అమలులోకి తెస్తోంది. ఇందులో భాగంగా, ఇప్పటికే తమ ఇళ్లలో పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ కలిగి ఉన్న వినియోగదారులకు జూన్ 1 నుంచి ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా నిలిచిపోనుంది. ఒకే కుటుంబానికి ఒకటి కంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉండకూడదనే ‘వన్ హౌస్ – వన్ కనెక్షన్’ పాలసీని ప్రభుత్వం మరింత కఠినతరం చేస్తోంది.
ఆటోమేటిక్‌గా రద్దు కానున్న కనెక్షన్లు
ఇప్పటికే గ్యాస్ పైప్‌లైన్ (PNG) వాడుతున్న వారు తమ ఎల్‌పీజీ కనెక్షన్‌ను స్వచ్ఛందంగా వదులుకోవాలని అధికారులు గతంలోనే సూచించారు. అయితే, ఇప్పటికీ రెండు కనెక్షన్లను కలిగి ఉన్న వారిపై జూన్ 1 నుంచి ఆటోమేటిక్ చర్యలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs), గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలు తమ డిజిటల్ డేటాబేస్‌లను అనుసంధానించాయి. దీనివల్ల పీఎన్‌జీ వాడుతున్న వారి వివరాలు సులభంగా ఐడెంటిఫై అవుతాయి. ఫలితంగా జూన్ 1 తర్వాత అలాంటి వారు కొత్తగా సిలిండర్ రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకునే సదుపాయాన్ని కోల్పోతారు.
పీఎన్‌జీ (PNG) అంటే ఏమిటి? దీని వల్ల లాభాలేంటి?
పీఎన్‌జీ అనేది ఎల్‌పీజీ సిలిండర్ల తరహాలో కాకుండా, పైప్‌లైన్ ద్వారా నేరుగా మీ ఇంటి వంటగదికే సరఫరా అయ్యే సహజ వాయువు.
- నిరంతర సరఫరా: గ్యాస్ అయిపోతుందనే చింత ఉండదు, సిలిండర్ల బుకింగ్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు.
- వినియోగానికి తగ్గట్టే బిల్లు: విద్యుత్ మీటర్ తరహాలోనే దీనికి కూడా మీటర్ ఉంటుంది. మీరు ఎంత గ్యాస్ వాడితే అంత మొత్తానికే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.
- ధరల వివరాలు: ప్రస్తుతం పీఎన్‌జీ యూనిట్ (క్యూబిక్ మీటర్) ధర సుమారు రూ.40 నుంచి రూ.60 వరకు పలుకుతోంది. ఒక సాధారణ కుటుంబానికి నెలకు దాదాపు రూ.400 నుండి రూ.800 వరకు మాత్రమే బిల్లు వచ్చే అవకాశం ఉంది.
కొత్త కనెక్షన్ ఖర్చులు మరియు ప్రస్తుత సవాళ్లు
కొత్తగా పీఎన్‌జీ కనెక్షన్ పొందాలనుకునే వారు ప్రారంభంలో డిపాజిట్ మరియు ఇన్‌స్టాలేషన్ చార్జీల కింద సుమారు రూ.7,000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ వంటి మహానగరాల్లో ‘భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్’ (BGL) సంస్థ ఈ పీఎన్‌జీ మౌలిక వసతులను వేగంగా విస్తరిస్తోంది. అయితే, ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే.. నగరాల్లోని అన్ని ప్రాంతాలకూ, గల్లీలకూ ఇంకా ఈ పైప్‌లైన్ సౌకర్యం అందుబాటులోకి రాలేదు. పైప్‌లైన్ నెట్‌వర్క్ లేని ప్రాంతాల ప్రజలు యథావిధిగా ఎల్‌పీజీ సిలిండర్లపైనే ఆధారపడాల్సి ఉంటుంది.
- Youtube Channel: Click Here
- Horror Stories: Click Here
- Entertainment: Click Here










