ఓటర్ల జాబితాలో భారీ కోత: 63 లక్షల ఓట్ల తొలగింపు..| west-bengal-voter-list-revision-63-lakh-names-removed-mamata-banerjee-bhavanipur

west-bengal-voter-list-revision-63-lakh-names-removed-mamata-banerjee-bhavanipur

పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SSR) ప్రక్రియ ముగిసింది. ఈ సవరణ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 63.66 లక్షల ఓట్లను తొలగించినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (CEO) మనోజ్ కుమార్ అగర్వాల్ శనివారం వెల్లడించారు. మరో 60.06 లక్షల ఓట్లకు సంబంధించి త్వరలోనే న్యాయపరమైన పరిశీలన చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

తగ్గిన ఓటర్ల సంఖ్య: గత ఏడాది నవంబర్‌లో ప్రారంభమైన ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియకు ముందు రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 7.66 కోట్లుగా ఉండేది. తాజా సవరణల తర్వాత ఈ సంఖ్య 7.04 కోట్లకు తగ్గినట్లు సీఈఓ వివరించారు.

మమత కంచుకోట భవానీపూర్‌లో భారీ మార్పులు: ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఓట్ల తొలగింపు ప్రక్రియ చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ మొత్తం 47,110 ఓట్లను జాబితా నుంచి తొలగించారు.

  • ముసాయిదా జాబితాలో 44,786 పేర్లు తొలగించగా, తుది జాబితాలో మరో 2,324 పేర్లను తొలగించారు.

  • గత ఎన్నికల్లో మమతా బెనర్జీకి ఇక్కడ 58 వేల ఓట్ల ఆధిక్యం లభించగా, ఇప్పుడు 47 వేల ఓట్లు తగ్గడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మార్చి రెండో వారంలో ఎన్నికల నగారా? పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రకటన మార్చి రెండో వారంలో వెలువడే అవకాశం ఉందని ఎన్నికల అధికారి కార్యాలయ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో మూడు విడతల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి బృందం హోలీ పండుగ తర్వాతే రాష్ట్రంలో పర్యటించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.


Follow Links

Leave a Comment