pm modi slams congress over protest ai impact
ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ‘AI ఇంపాక్ట్ సమ్మిట్’ రాజకీయ వివాదానికి కేంద్రబిందువుగా మారింది. కృత్రిమ మేధ (AI) భవిష్యత్తుపై అంతర్జాతీయ చర్చలు జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక వేదికను, కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ నిరసనలకు వాడుకోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు.
మీరట్ మెట్రో హైస్పీడ్ రైలు కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్ తీరును తప్పుబట్టారు. దేశంలోనే అత్యంత పురాతనమైన పార్టీ సైద్ధాంతికంగా దిగజారిపోయిందని, ఈ ఘటన అందుకు నిదర్శనమని ప్రధాని విమర్శించారు.భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ప్రజలు శ్రమిస్తుంటే, కొన్ని పార్టీలు మాత్రం దేశ ప్రగతిని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. అంతర్జాతీయ అతిథుల ముందు ఇలాంటి నిరసనలు చేపట్టడం ద్వారా కాంగ్రెస్ దేశం పరువు తీస్తోందని, వారి అసలు స్వరూపం ఇప్పటికే ప్రజలకు తెలుసని మండిపడ్డారు.
నిరసన వెనుక కాంగ్రెస్ వాదన:
మరోవైపు, ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఈ నిరసనను సమర్థించుకుంది. “AI సమ్మిట్ వేదికగా దేశ గుర్తింపును తాకట్టు పెడుతున్న ప్రధానికి వ్యతిరేకంగానే తాము గళమెత్తాం” అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. నిరసనకారులు ప్రధాని విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేయగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.










