తెలంగాణ‌కు కేంద్రం బ‌కాయి 1,468.94 కోట్ల రూపాయలు | Telangana owes Rs 1468.94 crore to the Centre

Telangana owes Rs 1468.94 crore to the Centre

వానాకాలం పంట‌కు (2025-26 సీజ‌న్‌) సంబంధించి తెలంగాణలో అద‌నంగా సేక‌రించిన 18 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) తీసుకోవాల‌ని కేంద్ర ఆహార, పౌర‌ స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి గారికి ముఖ్య‌మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు విజ్ఞ‌ప్తి చేశారు. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి కేంద్ర మంత్రి గారితో వారి నివాసంలో భేటీ అయ్యారు.

వానా కాలం పంట‌కు సంబంధించి 53.73 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల‌కు (ఎల్ఎంటీ) అనుమ‌తించార‌ని, కానీ భారీగా పంట ఉత్ప‌త్తి కావ‌డంతో అద‌నంగా 18 ఎల్ఎంటీలు తెలంగాణ ప్రభుత్వం సేక‌రించినందున ఆ మొత్తాన్ని 10 శాతం నూక‌తో ఎఫ్సీఐ (FCI) సేక‌రించాల‌ని ఈ సందర్భంగా కోరారు.2024-25 యాసంగి పంట‌కు సంబంధించి 5 శాతం నూక‌తో అద‌నంగా 10 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుమ‌తించాల‌ని అడిగారు. 2024-25 వానా కాలం పంట‌కు సంబంధించి క‌స్ట‌మ్స్ మిల్లింగ్ రైస్‌కు ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 28 వ తేదీ వ‌ర‌కు గడువు నిర్దేశించార‌ని, దానిని మ‌రో 2 నెల‌లు పాటు పొడిగించాల‌ని కూడా విజ్ఞప్తి చేశారు.

భార‌త ఆహార సంస్థకు 2014-15 వానా కాలంలో స‌ర‌ఫ‌రా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణ‌కు బ‌కాయి పెట్టిన 1,468.94 కోట్ల రూపాయలను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కోరారు. నాడు అద‌న‌పు లెవీ సేక‌ర‌ణ‌కు సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వమే భ‌రించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆనాడు ధాన్యం సేక‌ర‌ణ‌కు రుణం తీసుకున్నామ‌ని, దానికి వ‌డ్డీ 2 వేల కోట్ల రూపాయల‌కుపైగా పెరిగింద‌ని తెలియజేశారు. ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ యోజ‌న కింద మే నెల 2021 నుంచి మార్చి 2022 వ‌ర‌కు స‌ర‌ఫ‌రా చేసిన అద‌న‌పు బియ్యం, 2022 ఏప్రిల్ నెల‌లో స‌ర‌ఫ‌రా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు 343.27 కోట్ల‌ రూపాయలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని విజ్ఞ‌ప్తి చేశారు.

Leave a Comment