Telangana govt releasing Rythu Bharosa funds: సంక్రాంతి కానుకగా రైతులకు తీపి కబురు అందించనున్న సీఎం 2025

Telangana govt releasing Rythu Bharosa funds

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు సంక్రాంతి కానుక ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతుభరోసా నిధులను విడుదల చేసేందుకు కొత్త విధానంతో ముందుకు వెళ్తోంది. గత వానాకాలం సీజన్‌లో కేవలం 9 రోజుల్లోనే సుమారు రూ.9 వేల కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడూ అదే తరహాలో పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసింది.0

డిసెంబరు నెలలో కొన్ని జిల్లాల్లో యాసంగి సాగు ప్రారంభమైనా జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా సాగు ముమ్మరంగా కొనసాగనుంది. ఈ క్రమంలో సరైన సమయంలో సాగు ఖర్చులకు పనికొచ్చేందుకు వీలుగాఉండాలి అని సంక్రాంతి కానుకగా పెట్టుబడి సాయం అందించాలని చూస్తోంది. రైతుభరోసా పథకం కోసం ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు రూ.18 వేల కోట్లు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా కోటిన్నర ఎకరాల మేర వ్యవసాయ భూములుండగా.. రెండు పంటలకు కలిపి ఎకరానికి రూ.12 వేల చొప్పున అందజేయనుంది. వానాకాలం సీజన్‌లో 69.40 లక్షల మంది రైతులకు రూ.8,744 కోట్లు పంపిణీ చేసింది. ఇప్పుడు యాసంగిలోనూ ఇదే స్థాయిలో నిధులు అవసరమని గుర్తించిన అధికారులు నిధుల సమీకరణ పైన ఫోకస్ చేసారు.

ప్రభుత్వం అధికారికంగా తీసుకుంటున్న నిర్ణయంతో వెంటనే చెల్లింపులు ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నారు. జనవరి రెండో వారం నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి సంక్రాంతి పండుగ సమయంలో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసేలా చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలవుతున్న వేళ రైతుభరోసా ఇచ్చే తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయశాఖ ఎప్పటికప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సాగు లెక్కలు నమోదు చేస్తోంది. వ్యవసాయ విస్తరణాధికారులు క్రాప్‌ బుకింగ్‌ పోర్టల్‌లో వివరాలు అప్‌లోడ్‌ చేస్తున్నారు. గత యాసంగి, వానాకాలం సాగు లెక్కలు, రైతుభరోసా చెల్లింపుల వివరాలను పరిశీలించడంతోపాటు.. ప్రస్తుత యాసంగి సీజన్‌లో ఎంత మంది రైతులకు, ఎన్ని ఎకరాలకు రైతుభరోసా చెల్లించాల్సి వస్తుందనే దాని పైన లెక్కలు సిద్దం చేస్తున్నారు. ఎకరానికి రూ.6 వేల చొప్పున మొత్తం అవసరమైన నిధులెన్ని అన్న వివరాలపై కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వివరాలన్నీ ఆర్థిక శాఖకు సమర్పించేందుకు సిద్ధం చేస్తున్నారు.

Leave a Comment