Telangana Local Body Election Shedule Released
తెలంగాణలో ఎన్నికల జాతర మెుదలు.రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లోని 565 మండలాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి.మొత్తం 565 జడ్పీటీసీ స్థానాలకు, 5,749 ఎంపీటీసీ, 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ రాణికుముదిని తెలిపారు.అయితే ఈ ఎన్నికలు మెుత్తం ఐదు దశల్లో నిర్వహించనున్నారు.అయితే మెుదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిపి ఆ తర్వాత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరపనున్నారు. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా ఆరోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిపి .. మూడు దశల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహిస్తారు. జడ్పీటీసీ,ఎంపీటీసీ ఫలితాలు నవంబర్ 11న వెల్లడించనుండగా సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు పోలింగ్ జరిగిన రోజే ప్రకటించనున్నారు. మెుత్తంగా నవంబర్ 11తో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.
ఈ మేరకు నేటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ఎస్ఈసీ వెల్లడించారు. జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు వచ్చే నెల అక్టోబర్ 23న మొదటి విడత, అక్టోబర్ 27న రెండో విడత ఎన్నికలు నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో విడత నవంబర్ 8న నిర్వహిస్తామని వివరించారు.
ముఖ్యమైన తేదీలు

ముందుగా ఓటర్ల జాబితాను వార్డు, గ్రామం, ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) స్థానాలకు అనుగుణంగా ప్రచురించినట్లు ఆమె తెలిపారు. ఈ పనులు పూర్తి చేయడంలో అనేక సమస్యలు ఎదురైనప్పటికీ.. అధికారులు పట్టుదలతో పనిచేసి జాబితా ప్రచురణను సకాలంలో పూర్తి చేశారని ఎస్ఈసీ పేర్కొన్నారు.
కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ సర్కార్ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవోను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. ప్రస్తుతం పిటిషన్ విచారణ దశలో ఉంది. గతంలో స్థానిక ఎన్నికలకు హైకోర్టు డెడ్లైన్ విధించిన నేపథ్యంలో తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.