రైతు నేస్తం’ వేదికగా ఆన్‌లైన్ ద్వారా మీట నొక్కి రైతులందరికీ “రైతు భరోసా” నిధులను విడుదల | CM Revanth Reddy Released Rythu Bharosa Amount 2025

CM Revanth Reddy Released Rythu Bharosa Amount

తొలకరి ప్రారంభమై వ్యవసాయ పనులు ముమ్మరమైన తరుణంలో రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు శుభవార్త చెప్పారు. లక్షలాది మంది రైతుల సమక్షంలో ‘రైతు నేస్తం’ వేదికగా ఆన్‌లైన్ ద్వారా మీట నొక్కి రైతులందరికీ “రైతు భరోసా” నిధులను విడుదల చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 70,11,984 మంది రైతులకు పెట్టుబడి సాయంగా దాదాపు 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా నగదు బదిలీ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు వెల్లడించారు.రైతులతో ముఖాముఖి మాట్లాడే వీలుకల్పించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 1600 వందల రైతు వేదికలకు అనుసంధానం చేసే వీడియో కాన్ఫరెన్స్ విధానానికి ముందుగా ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6.4 లక్షల మంది రైతులు పాల్గొన్నారు.

ఆడిటోరియంలో ప్రత్యక్షంగా హాజరైన రైతులే కాకుండా రైతు వేదికల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న లక్షలాది మంది రైతుల సమక్షంలో 1 కోటి 49 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయంగా మీట నొక్కి 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈరోజు నుంచి వచ్చే 9 రోజుల్లోగా రైతులందరి ఖాతాల్లో నిధులు జమవుతాయని ప్రకటించారు.ఒక ఉత్సవంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో పాటు యావత్ మంత్రివర్గ సభ్యులు, పలువురు పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్, అధికారులు పాల్గొన్నారు.

Leave a Comment