CM revanth reddy opens New Police station
హైదరాబాద్ వారసత్వ సంపదను కాపాడుకుంటూ, ఇక్కడి ప్రకృతిని పరిరక్షిస్తూ దీన్ని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సహజ వనరులు, సంపద కాలగర్భంలో కలిసిపోతున్న తరుణంలో ఈ నగరాన్ని పునరుద్ధరించాలన్న ఆలోచనతోనే హైడ్రాను ప్రారంభించామని వివరించారు.
ట్యాంక్‌బండ్ బుద్ధభవన్‌లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (#HYDRAA) కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్‌ను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. హైడ్రాకు ప్రత్యేకంగా కేటాయించిన 122 వివిధ వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. హైడ్రా కోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ హైడ్రా ఆవశ్యకతను వివరించారు. “హైడ్రా అంటే ఇదేదో కేవలం పేదల ఇండ్లు కూల్చడానికన్నట్టు కొందరు చిత్రీకరిస్తున్నారు. శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల నగరంలో తలెత్తే సమస్యలు ఎవరు పరిష్కరించాలన్న విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని గమనించి నిపుణులతో చర్చించి హైడ్రాను తెచ్చాం.
ఆక్రమణలను తొలగించడం, అక్రమ నిర్మాణాలను తొలగించడం, కబ్జాలను అరికట్టడం, నాలాల పునరుద్దరణ, నీటి కాలుష్యాలపై చర్యలు తీసుకోవడం, వర్షాలు, వరదల వంటి విపత్తు సమయాల్లో సహాయక చర్యల్లో పాల్గొనడం, ప్రజా ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించడం వంటి అనేక కార్యక్రమాలు చేపడుతుంది.హైడ్రాపై అతిపెద్ద సామాజిక బాధ్యత పెట్టాం. ఇందులో పనిచేసే వారికి ఉద్యోగం కాదు. కాజ్యువల్ గా పనిచేస్తే కుదరదు. హైడ్రా మానవీయ కోణంలో పనిచేయాలి. నిరుపేదల పట్ల ప్రేమతో, పెద్దొళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలి. పేదవారిని ఆదుకోవడానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలు తయారు చేయాలి. వారికి అవసరమైన అన్ని వసతులు ప్రభుత్వం కల్పిస్తుంది. ఇది ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ. దీన్ని పునరుద్దరించుకోవలసిన అవసరం ఉంది. బెంగుళూరులో నీటి నిలువలను ఒడిసిపట్టుకునే పరిస్థితి లేక వలసపోయే దుస్థితి వచ్చింది. చిన్న వరదలు వచ్చినా ముంబయ్, చెన్నై వరదల మయమైపోయాయి. దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం నియంత్రించని కారణంగా పార్లమెంట్ నుంచి పాఠశాలల వరకు సెలవులు ప్రకటించుకోవలసిన పరిస్థితి వచ్చింది.
దేశంలోని మెట్రోపాలిటన్ సిటీలు నివసించడానికి యోగ్యం కాని నగరాలుగా మారుతున్నాయి. అలాంటి ఉపద్రవాల నుంచి గుణపాఠం నేర్చుకోకపోతే హైదరాబాద్ నగరం కూడా వాటి జాబితాలో చేరుతుంది. రాజధాని నగర అభివృద్ధిలో హైడ్రా భాగస్వామి అవుతుంది. అన్ని శాఖల సమన్వయంతో హైడ్రా అనేక పనులు చేస్తుంది. వర్షాలొస్తే, వరదలొస్తే కాలనీలకు కాలనీలే నీళ్లల్లో మునిగిపోతున్నాయి. చిన్న గాలొస్తే చెట్లు విరిగి పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నీళ్లను తొలగించడానికి, కరెంట్ పోతే పునరుద్దరించడానికి, వరదలు వస్తే చిక్కుకున్న వారిని రక్షించుకోవడానికి హైడ్రా పనిచేస్తుంది.
మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరంపై ప్రజలే అప్రమత్తం కావాలి. చెరువులు, నాలాల్లో ప్రవహించాల్సిన నీరు ఇళ్లల్లో పారుతుంటే వాటిని కాపాడుకోవలసిన అవసరం లేదా? మూసీలో బతకాలని ఏ పేదవారైనా అనుకుంటారా. నగరంలో 421 చెరువులు, పెద్ద పెద్ద నాలాలు కబ్జాలకు గురయ్యాయి. ఎవరైతే మూసీ ఆక్రమణలను ప్రోత్సహించారో, ఎవరైతే నాలాలను ఆక్రమించారో వారే హైడ్రా అంటే భయపడుతున్నారు.తొందరలోనే మూసీ పరీవాహక ప్రాంత ప్రజల దగ్గరకు ప్రజా ప్రతినిధులు, అధికారులను పంపించి వారితో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయిస్తా. వారి జీవితాలకు మంచి వెలుగు ఇవ్వాలని అనుకుంటున్నా. కావాలంటే వారందరికీ మరో ప్రాంతంలో ఇళ్ల పట్టాలిస్తాం. మూసీ మురికికూపంలో ఎందుకు బతకాలి. ప్రభుత్వ భూములున్న చోట వారికి అపార్ట్ మెంట్లు కట్టి ఇళ్లిస్తాం. ఆ కుటుంబాలు గౌరవంగా బతకడానికి ఏర్పాటు చేస్తాం” అని ముఖ్యమంత్రి