RevanthReddy Released Rythu Bharosa Guidelines: రైతు భరోసా మార్గదర్శకాలను జారీ చేసింది.
రైతు భరోసా పథకిం కింద రైతులకు ఈనెల 26 వ తేదీ నుంచి పంట పెట్టుబడి సహాయం అందించడానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.
భూభారతి పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం అందించనున్నట్టు ఉత్తర్వుల్లో (జీవో ఆర్టీ నంబర్ 18 / తేదీ 10-01-2025) పేర్కొంది. రైతులకు సంబంధించిన అంశాలు సరళంగా అర్థం కావాలన్న ఉద్దేశంతో గతంలో రుణమాఫీ మార్గదర్శకాలపైన తెలుగులో జీవో జారీ చేసిన ప్రభుత్వం రైతు భరోసా జీవోను కూడా తెలుగులో వెలువరించింది.
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల వంటి కీలకమైన నాలుగు సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతు భరోసా కు కావలసిన మార్గదర్శకాలను విడుదల చేశారు
- ఎలాంటి ఆంక్షలు లేకుండా తెలంగాణలోని వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతు భరోసా చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.అలాగే, వ్యవసాయానికి పనికి రాని భూములను గుర్తించి వాటిని రైతు భరోసా నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
- “వ్యవసాయయోగ్యం కాని రియల్ ఎస్టేట్ భూములు, లే అవుట్ చేసిన భూములు, నాలా కన్వర్షన్ చేసిన భూములు, మైనింగ్ చేస్తున్న భూములు, గోదాములు నిర్మించిన భూములు, వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూముల వివరాలను సేకరించాలి.
- ప్రతి మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించాలి. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల రెవెన్యూ రికార్డులు, సంబంధిత విభాగాల రికార్డులన్నీ క్రోడీకరించుకోవడంతో పాటు విలేజ్ మ్యాప్‌లను పరిశీలించడం, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాటిని ధ్రువీకరించుకోవాలి.
- వ్యవసాయ యోగ్యం కాని భూముల జాబితాలను పక్కాగా తయారు చేసి గ్రామ సభల్లో ప్రచురించాలి. వీటిని గ్రామ సభల్లో చర్చించి వెల్లడించాలి. ఇందులో ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- రైతు పంట వేసినా, వేయకపోయినా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికీ రైతు భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. వ్యవసాయ యోగ్యం కాని భూములకు కూడా గతంలో పెట్టుబడి సాయం అందించారు. అనర్హులకు ప్రయోజనం అందించకూడదు. అనర్హులను గుర్తించాల్సిన అవసరం ఉంది.