Telangana Government 1 63 559.31 Crores of Projects : తెలంగాణ రాష్ట్రంలో వివిధ ర‌కాల అభివృద్ధి ప‌నుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు

Photo of author

By Admin

Telangana Government 1 63 559.31 Crores of Projects : తెలంగాణ రాష్ట్రంలో వివిధ ర‌కాల అభివృద్ధి ప‌నుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు

తెలంగాణ రాష్ట్రంలో వివిధ ర‌కాల అభివృద్ధి ప‌నుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు ఇచ్చేందుకు కృషి చేయాల‌ని కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ మంత్రి జి. కిష‌న్ రెడ్డి గారికి ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు విజ్ఞ‌ప్తి చేశారు. ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌), హైద‌రాబాద్ మెట్రో ఫేజ్- 2 తోపాటు హైద‌రాబాద్, వ‌రంగ‌ల్‌ల్లో సీవ‌రేజీ, అండ‌ర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్‌, సింగ‌రేణి సంస్థ‌కు బొగ్గు గ‌నుల కేటాయింపు స‌హా ప‌లు అంశాల‌పై కేంద్ర మంత్రితో ముఖ్య‌మంత్రి చ‌ర్చించారు.

సీఎం గారు ఢిల్లీలో కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి గారిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టుల వివరాలు అందించారు. ఈ సంద‌ర్భంగా మొత్తం రూ.1,63,559.31 కోట్ల విలువైన ప్రాజెక్టుల విష‌యంలో కేంద్రం నుంచి సహకారం అందించాలని కోరారు. ఆర్ఆర్ఆర్ నిర్మిస్తామ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ 2022లోనే ప్ర‌క‌టించిన విష‌యాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ఆర్ఆర్ఆర్ ఉత్త‌ర భాగం భూ సేక‌ర‌ణ‌ను ప్రారంభించి, త్రైపాక్షిక ఒప్పందం పూర్త‌యినా ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్‌హెచ్ఏఐ అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని తెలిపారు. ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగానికి ఇంకా అనుమ‌తి ఇవ్వ‌ని విష‌యాన్ని గుర్తుచేశారు.

మెట్రో ఫేజ్ 2లో భాగంగా నాగోల్ నుంచి రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం, రాయ‌దుర్గం నుంచి కోకాపేట్ నియోపొలిస్‌, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయ‌ణ‌గుట్ట‌, మియాపూర్‌-ప‌టాన్ చెరు, ఎల్‌బీ న‌గ‌ర్‌-హ‌య‌త్ న‌గ‌ర్ మ‌ధ్య మొత్తం 76.4 కి.మీల నిర్మించ‌నున్న మెట్రో రైలు నిర్మాణానికి రూ.24,269 కోట్ల అంచనా వ్యయంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సంయుక్తంగా 50: 50 వాటాతో దాన్ని చేప్ట‌టేందుకు స‌హ‌క‌రించాల‌న్నారు.మూసీరివ‌ర్ ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా చేప‌ట్ట‌నున్న గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు ర‌క్ష‌ణ శాఖ ప‌రిధిలోని 222.27 ఎక‌రాల భూమి రాష్ట్ర ప్ర‌భుత్వానికి బ‌ద‌లాయించాల‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ గారిని ఇప్ప‌టికే కోరిన విష‌యాన్ని కిష‌న్ రెడ్డి గారి దృష్టికి తెస్తూ ఆ విషయంలో చొరవ చూపాలని, మూసీ పునరుజ్జీవం కోసం చేపట్టిన వివిధ ప్రాజెక్టుల అభివృద్ధికి నిధుల విషయంలో సహకారాన్ని కోరారు.

తెలంగాణ‌లో రెండో పెద్ద న‌గ‌ర‌మైన వ‌రంగ‌ల్ లో అండ‌ర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్‌ను రూప‌క‌ల్ప‌న చేశామని, రూ.4,170 కోట్ల వ్య‌య‌మ‌య్యే ఈ ప్లాన్‌ను అమృత్ 2 లేదా ప్ర‌త్యేక ప‌థ‌కం కింద చేప‌ట్టాల‌ని కోరారు.దీర్ఘ‌కాలం పాటు సింగ‌రేణి సంస్థ మ‌నుగ‌డ కొన‌సాగించేందుకు గానూ గోదావ‌రి లోయ ప‌రిధిలోని బొగ్గు బ్లాక్‌ల‌ను సింగ‌రేణికి కేటాయించాల‌ని కోరారు. తెలంగాణ‌ను సెమీకండ‌క్ట‌ర్ మిష‌న్ లో చేర్చాల‌ని విజ్ఞప్తి చేశారు.కిషన్ రెడ్డి గారిని కలిసిన వారిలో సీఎంగారితో గారితో పాటు పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, సురేష్ షేట్కర్ గారు, పోరిక బలరాం నాయక్ గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, గడ్డం వంశీగారు, రాయసాయం రఘురామిరెడ్డి గారు న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి గారు ఉన్నారు.

Leave a Comment