Telangana Returns 1000 Cores Funding; అదానీ రూ.100 కోట్లు తెలంగాణకు వద్దు: సీఎం రేవంత్ రెడ్డి
ఆదానీ ఫౌండేషన్ ప్రకటించిన వంద కోట్ల రూపాయల విరాళాన్ని స్వీకరించకూడదని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు.
తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (#CSR) నిధుల కింద ఆదానీ ఫౌండేషన్ ప్రకటించిన వంద కోట్ల రూపాయల విరాళాన్ని స్వీకరించకూడదని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అదానీ గ్రూపునకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, వివాదాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
అదానీ గ్రూపునకు సంబంధించి దేశ విదేశాల్లో దుమారం చెలరేగడం, ఆరోపణలు, ప్రత్యారోపణలు, చర్చోపచర్చలకు దారితీసిన తరుణంలో అలాంటి వివాదాల్లో తెలంగాణను చేర్చడం ఇష్టంలేక మంత్రులందరం కలిసి అదానీ ఫౌండేషన్ విరాళాన్ని స్వీకరించరాదని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు… యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YoungIndiaSkillsUniversity)కి ప్రకటించిన నిధులను బదిలీ చేయరాదని అదానీ ఫౌండేషన్ (Adani Foundation) చైర్ పర్సన్‌కు పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి గారు ఈనెల 24 వ తేదీన లేఖ రాశారు.
అదాని ఫౌండేషన్‌కు ఇప్పటికే లేఖ రాసిన విషయాన్ని సీఎంగారు ప్రస్తావిస్తూ, స్కిల్స్ యూనివర్సిటీ సీఎస్ఆర్ నిధుల కింద అనేక సంస్థలు విరాళం ప్రకటించినప్పటికీ ఇప్పటికి ఒక్క రూపాయి కూడా తెలంగాణ ఖాతాకు బదిలీ కాలేదన్నారు.స్కిల్స్ యూనివర్సిటీకి అవసరమైన కార్పస్ ఫండ్ కోసం ఆయా సంస్థలు ఇచ్చే నిధులపై 80G కింద ఆదాయపన్ను మినహాయింపు నిన్నమొన్ననే వచ్చిందని చెప్పారు. ఆ కారణంగా ఇప్పటివరకు ఏ సంస్థ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని అన్నారు. తాజా వివాదాల నేపథ్యంలో అదానీ ఫౌండేషన్ ప్రకటించిన నిధులను బదిలీ చేయొద్దని లేఖ రాయడం జరిగిందని తెలిపారు.తెలంగాణ యువత ప్రపంచంతో పోటీ పడాలన్న సదుద్దేశంతో ఒక గొప్ప ఆలోచనతో ప్రారంభించిన స్కిల్స్ యూనివర్సిటీపై వివాదాలు రాకూడదనే అదానీ గ్రూపు విరాళం వద్దనుకుంటున్నట్లు చెప్పారు. అయితే, ఈ నిధుల విషయంలో కూడా రాజకీయ కోణంలో ఆరోపణలు చేయడం నిరుద్యోగ యువకులకు నష్టపరిచే విధంగా కొందరు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనించాలని కోరారు.
చట్ట బద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా ఏదైనా కార్యక్రమంపై టెండర్లు పిలిచినా, పెట్టుబడులు పెట్టినా కచ్చితమైన నియమ నిబంధనలతో అన్ని సంస్థలు పాల్గొనేలా అవకాశం కల్పిస్తామని, నిబంధనల ప్రకారం ఏ సంస్థకు దక్కితే వారికి కాంట్రాక్టులను కేటాయించడమన్న విధానం అనుసరిస్తున్నామని స్పస్టం చేశారు.ఎవరికీ ఆయాచిత లబ్ది చేకూర్చే నిర్ణయాలను ప్రజా ప్రభుత్వం తీసుకోబోదని పునరుద్ఘాటించారు. అదానీ అయినా, అంబానీ అయినా, టాటా బిర్లాలైనా మరే ఇతర సంస్థ అయినా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుందనే కాంగ్రెస్ విధానం రాహుల్ గాంధీ గారు ఇదివరకే తేల్చిచెప్పినట్లు సీఎం గారు గుర్తుచేశారు.
ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి కేంద్రం వద్ద ఉన్న పెండింగ్ అంశాలపై మంగళవారం రాష్ట్ర ఎంపీలతో ఢిల్లీలో చర్చిస్తామని తెలిపారు.ఎయిర్ పోర్టు, మెట్రో విస్తరణ, సాగునీటి కేటాయింపుల వంటి ప్రధానమైన అనేక పెండింగ్ అంశాలలో కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, అనుకూలతను బట్టి పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర మంత్రులను కలుస్తామని సీఎం గారు పేర్కొన్నారు.మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే మందుల సామేల్ గారు, ఇతర నేతలతో కలిసి ముఖ్యమంత్రి గారు మీడియా సమావేశంలో మాట్లాడారు.