59 castes in SCs are divided into three groups: SC ల్లోని 59 కులాలను I, II, III మూడు గ్రూపులుగా విభజించాలని కమిషన్ సిఫారసు

Photo of author

By Admin

59 castes in SCs are divided into three groups

షెడ్యూల్డు కులాల వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ గారి నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ సిఫారసులను పరిశీలించిన ప్రభుత్వం వాటిల్లో మూడింటిని ఆమోదించడంతో పాటు క్రీమీ లేయర్‌ ప్రతిపాదనను తిరస్కరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఎస్సీ ఉప కులాల వర్గీకరణ సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోందని చెప్పారు.

“నా రాజకీయ జీవితంలో అత్మసంతృప్తిని కలిగించిన రోజు. ఇలాంటి అవకాశం నాకు రావడం సంతోషం. చరిత్ర పుటల్లో ఇది శాశ్వతంగా నిలిచిపోతుంది. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చినప్పుడు సభ నుంచి బయటకు పంపించారు. ఈనాడు సభా నాయకుడిగా వర్గీకరణ అమలుకు శాసనసభలో నిర్ణయం తీసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. అతి తక్కువ సమయంలో సంక్లిష్టమైన సమస్యకు పరిష్కారం చూపడానికి కృషి చేసిన అందరికీ అభినందనలు” అని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యుల్డ్ కులాల ప్రత్యేక వర్గాల ఉప వర్గీకరణ నివేదికపై శాసనసభ ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి గారు కీలక ప్రకటన చేశారు. కమిషన్ ఇచ్చిన సూచనలపై ఆమోదించిన మూడు సిఫారసులకు అనుగుణంగా ప్రభుత్వం తదుపరి చర్యలను చేపడుతుందని, తద్వారా ఎన్నో ఏళ్లుగా వర్గీకరణ కోసం ఎదురుచూస్తున్న వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.

ఎస్సీల్లోని 59 కులాలను I, II, III మూడు గ్రూపులుగా విభజించాలని కమిషన్ సిఫారసు చేసింది. ఎస్సీ జనాభా ప్రాతిపదికన గ్రూప్ -1 కింద 15 ఉప కులాలను గుర్తించి వారికి 1 శాతం, గ్రూప్ 2 కింద 18 ఉప కులాలకు 9 శాతం, గ్రూప్ – 3 కింద 26 ఉప కులాలకు 5 శాతం మేరకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఏకసభ్య కమిషన్ సిఫారసులను మంత్రిమండలి యదాతథంగా ఆమోదించింది.ఉద్యోగ ఖాళీలను క్రమబద్ధంగా సమాన పద్ధతిలో భర్తీ చేయడానికి కమిషన్ సూచించిన ప్రిఫరెన్షియల్ మోడల్ ను ప్రభుత్వం ఆమోదించింది. ఇందుకోసం ఎస్సీ కులాలకు రోస్టర్ పాయింట్లను ఇస్తూ కమిషన్ ఇచ్చిన సిఫారసులకు ఆమోదించింది.

షెడ్యూల్డు కులాల్లో క్రీమీ లేయర్ విధానం ప్రవేశపెట్టాలన్న కమిషన్ చేసిన సిఫారసును ప్రభుత్వం తిరస్కరించింది.ఎస్సీ కులాల ఉప వర్గీకరణపై గౌరవ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు దేశంలోనే మిగతా రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై 2024 ఆగస్ట్ 1 వ తేదీన ఇదే శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసింది. ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటన చేసింది. వెంటనే ఈ ప్రక్రియలో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా కార్యాచరణ చర్యలు చేపట్టింది.ఇందుకోసం మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన మంత్రులు శ్రీ దామోదర రాజనర్సింహ గారు, శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, శ్రీమతి ధనసరి సీతక్క గారు, ఎంపీ డాక్టర్ మల్లు రవి గారు సభ్యులుగా కమిటీని నియమించింది.

మంత్రివర్గ ఉపసంఘం సూచనల మేరకు ప్రభుత్వం 2024 అక్టోబర్ 11వ తేదీన డాక్టర్ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌గారి అధ్వర్యంలో ఏక సభ్య న్యాయ కమిషన్‌ను నియమించి 60 రోజుల వ్యవధిలో నివేదికను అందించాలని నిర్దేశించింది. గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి కానందున ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఈ కమిషన్ గడువును ప్రభుత్వం పొడిగించింది.2024 నవంబర్ 11వ తేదీన విచారణ బాధ్యతలు స్వీకరించిన కమిషన్ అనేక జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించింది. ఎస్సీ ఆవాసాలను సందర్శించింది. ప్రజల నుంచి అనేక రూపాల్లో మొత్తం 8681 విజ్ఞాపనలను కమిషన్ అందుకుంది.

వీటితో పాటు ఎస్సీల (59 కులాలు) జనాభా, అక్షరాస్యత, ఉపాధి, విద్యా సంస్థలలో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఆర్థిక సహాయం మరియు రాజకీయ ప్రాతినిధ్యాలకు సంబంధించిన డేటాను అన్ని ప్రభుత్వ విభాగాలు, గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విచారణ కమిషన్ సేకరించింది.వీటన్నింటితో పాటు వివిధ సంస్థలు, సంఘాలు ఇచ్చిన వినతి పత్రాలను, అన్ని విభాగాల నుంచి అందిన సమాచారాన్ని కమిషన్ క్షుణ్ణాంగా పరిశీలించి నివేదికను తయారు చేసింది. కేవలం 82 రోజుల వ్యవధిలో ఫిబ్రవరి 3వ తేదీన కమిషన్ 199 పేజీల నివేదికలో ఎస్సీల్లోని 59 కులాలపై వివరణాత్మకంగా పేర్కొంది… అని ముఖ్యమంత్రి గారు తెలిపారు.

Leave a Comment