చమురు నౌకపై ఇరాన్ దాడి.. 15 మంది భారతీయులు | iran-attacks-skylight-oil-tanker-hormuz-strait-indian-crew-safe

iran-attacks-skylight-oil-tanker-hormuz-strait-indian-crew-safe

పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌ల చర్యలకు ప్రతిచర్యగా ఇరాన్ తన దాడులను ముమ్మరం చేసింది. తాజాగా హార్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న ‘స్కైలైట్’ అనే చమురు రవాణా నౌకపై ఇరాన్ దాడికి దిగింది. ఒమాన్‌లోని ముసందమ్ ద్వీపకల్ప తీరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

భారతీయులు సురక్షితం: ఈ ఆయిల్ ట్యాంకర్‌పై పలావు దేశ జెండా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. నౌకలో మొత్తం 20 మంది సిబ్బంది ఉండగా, వారిలో 15 మంది భారతీయులు, ఐదుగురు ఇరానియన్లు ఉన్నట్లు ఒమాన్ తీర ప్రాంత రక్షణ కేంద్రం (OMC) ధృవీకరించింది. దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన రక్షణ బృందాలు సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. ఈ ఘటనలో నలుగురు సిబ్బందికి గాయాలవ్వగా, ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.

వణికిస్తున్న డ్రోన్ దాడులు: ఈ దాడికి క్షిపణులను వాడారా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే, దీనికి ముందే దుఖ్మ్ పోర్టు వద్ద జరిగిన డ్రోన్ దాడిలో ఒక కార్మికుడు గాయపడినట్లు సమాచారం. హార్ముజ్ జలసంధి గుండా ఏ నౌకను అనుమతించబోమని ఇరాన్ నేవీ ఇప్పటికే రేడియో సందేశాల ద్వారా హెచ్చరికలు జారీ చేసింది.

వ్యాపార మార్గంపై ప్రభావం: ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం వాటా కలిగిన హార్ముజ్ జలసంధి, అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకం. పర్షియన్ గల్ఫ్‌ను ఒమాన్ గల్ఫ్ మరియు అరేబియా సముద్రంతో కలిపే ఈ మార్గంలో ఉద్రిక్తతలు పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది.



Follow Links

Leave a Comment